sachchidananda
-
దర్శకుడు సచీ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) కన్నుమూశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో సచీకి గుండెపోటు వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేశారు బంధువులు. కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై సచీకి చికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో వచ్చిన మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. సచీ ఒక్కరే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ (దర్శకత్వం కూడా), ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (దర్శకత్వం కూడా) చిత్రాలకు కథ అందించారు. ‘అనార్కలి’ (2015) చిత్రంతో సచీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత – నటుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
రోజూ సూర్య భగవానుడిని పూజించాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రోజూ సూర్య భగవానుడిని దర్శించి పూజించడం ద్వారా విటమిన్ డీ లభిస్తుందని, ఆరోగ్యంగా జీవించవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శ్రీచక్రపూజ నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అహం దరిచేరనీయకూడదని, ఇతరులను గౌరవించాలన్నారు. పరీక్షిత్ మహారాజు కథను వివరించారు. ఆలయంలోని సుదర్శన యోగ నరసింహస్వామి ఎంతో మహిమగలవారని, భక్తులు పూజలు నిర్వహిస్తే వారి సమస్యలు తొలగిపోయి కోరికలను నెరవేరుతాయని చెప్పారు. టీవీ, సీరియల్స్ చూడటం వలన మనిషికి జడత్వం లభిస్తుందన్నారు. తాను ప్రొద్దుటూరు పట్టణంలో భిక్ష స్వీకరించానని, ఆనాటి చదువుకున్న జ్ఞాపకాలను భక్తులకు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మెలగి, అందరూ సన్మార్గంలో నడవాలన్నారు. ఆంజనేయస్వామి, యోగిరాజ వల్లభ దత్తాత్రేయస్వామి, చాముండేశ్వరిదేవి, కాశీవిశ్వేశ్వరుడు, యోగ నరసింహస్వామిలను సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.