
పాటియాలా: భారత్ అథ్లెటిక్స్ (మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్) కోచ్ నికొలాయ్ స్నెసరెవ్ శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. బెలారస్‌కు చెందిన 72 ఏళ్ల స్నెసరెవ్... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లోని తన హాస్టల్ గదిలో శవమై తేలారు. మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. పాటియాలాలో శుక్రవారం ఇండియన్ గ్రాండ్‌ప్రి టోర్నీ జరిగింది. సన్నాహాల్లో భాగంగా ఉదయమే అథ్లెట్లతో కలిసి సాధన లో పాల్గొన్న స్నెసరెవ్ మధ్యాహ్నం ప్రధాన ఈవెంట్ జరిగే సమయంలో కనిపించలేదు. దాంతో అధికారులు ఆయన గదికి వెళ్లగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి చూస్తే తన మంచంపై కోచ్ పడిఉన్నారు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అవినాశ్ సాబ్లేతో పాటు ఇతర మిడిల్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు ఆయన శిక్షణ ఇస్తున్నారు.
2005లో తొలిసారి భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్నెసరెవ్ హయాంలోనే ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్, సుధా సింగ్, లలిత తదితరులు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్యతో విభేదాలతో 2019 ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కోచ్‌గా నియమించడంతో మంగళవారమే ఆయన భారతదేశానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment