భాను అతైయా
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా.
1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను.
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను.
ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment