Chandanwadi
-
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అతైయా ఇక లేరు
భారతదేశం తరఫున తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతైయా (91) ఇక లేరు. గురువారం ముంబైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా భాను అతైయా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిద్రలోనే ఆమె చనిపోయినట్లు భాను కుమార్తె రాధికా గుప్తా తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మెదడులో ఓ ట్యూమర్ ఉన్నట్టు కనుగొన్నారు. మూడేళ్లుగా ఆమె శరీరంలో సగభాగం చచ్చుబడిపోవడంతో మంచానికే పరిమితం అయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూరులో 1929 ఏప్రిల్ 28న జన్మించారు భాను అతైయా. 1983లో వచ్చిన గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారామె. ఆ సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాన్ మోలోతో కలసి ఆస్కార్ అందుకున్నారు భాను. గురుదత్ తెరకెక్కించిన ‘సీఐడీ’ (1956)తో కెరీర్ ప్రారంభించి సుమారు వంద సినిమాలకు పైనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘ఆమ్రపాలి’ చిత్రానికి వైజయంతి మాలకు, ‘గైడ్’లో వహీదా రెహమాన్‌కు, ‘సత్యం శివం సుందరం’లో జీనత్ అమన్‌కు ఆమె చేసిన కాస్ట్యూమ్స్‌కి బాగా పేరొచ్చింది. ‘లేకిన్, లగాన్’ చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు భాను. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడారామె... ‘‘ఆస్కార్ వేడుకలో కూర్చున్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు ‘అవార్డు మీకే వస్తుంది’ అన్నారు. కానీ నేను మాత్రం నా పని నేను సరిగ్గా చేశాను. గాంధీజీ పేరుకి, స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయం చేశాను. అది చాలు అని మాత్రమే అనుకున్నాను. అవార్డు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి’’ అని ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు భాను. 2012లో అవార్డును భద్రపరచడానికి ఆస్కార్ అవార్డు అకాడమీకే అవార్డును తిరిగి ఇచ్చారు భాను. ఆమె రచించిన ‘ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్’ పుస్తకం విడుదల సమయంలో ‘‘సినిమాకు కాస్ట్యూమ్స్ చాలా ప్రధానం. కానీ భారతీయ సినిమా కాస్ట్యూమ్స్‌కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అన్నారు భాను. దాదాపు 50 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వందకు పైగా సినిమాలు చేశారు భాను అతైయా. 2004లో ‘స్వదేశ్’ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. భాను మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భాను అతైయా అంత్యక్రియలు ముంబైలోని చందన్ వాడీ స్మశాన వాటికలో జరిగాయి. -
చందన్‌వాడీ, బీఐటీ చాల్స్‌కు నీరు, విద్యుత్ సరఫరా కట్
సాక్షి, ముంబై: చర్నీరోడ్ ప్రాంతంలోని చందన్వాడి, బీఐటీ చాల్స్లోగల ఆరు భవనాలకు నగరపాలక సంస్థ (బీఎంసీ) నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ఆరు భవనాల్లో 680 కుటుంబాలు నివాసముంటున్నాయి. నివాసుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల వల్ల ఇక్కడ పునరాభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఈ ఆరు భవనాలు 50 సంవత్సరాలకు పైబడినవి. శిథిలావస్థకు చేరుకున్నట్లు ఇటీవల బీఎంసీ నిర్వహించిన స్ట్రక్చరల్ ఆడిట్లో కూడా తేలింది. శిథిలావస్థలో ఉండడంవల్ల అవి ఎప్పుడైనా కూలే ప్రమాదముందని, వెంటనే ఖాళీ చేయాలని బీఎంసీ ఆదేశించింది. అయితే ఈ భవనాలు పటిష్టంగానే ఉన్నాయని, కేవలం మరుగు దొడ్లు, షెడ్లు మాత్రమే శిథిలావస్థకు చేరుకున్నాయని నివాసులంటున్నారు.. ఈ కుటుంబాలకు వాషినాకా, మాన్‌ఖుర్ద్, చెంబూర్ తదితర ట్రాంజిట్ క్యాంపుల్లో బీఎంసీ ఇళ్లు కేటాయించింది. వాటి పరిస్థితి కూడా ఇంచుమించు ఈ భవనాల లాగే ఉంది. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ కనీస సౌకర్యాలు లేవు. అక్కడి నుంచి పనులకు వెళ్లడం, పిల్లలు స్కూలుకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో తాము అక్కడ ఉండలేమని చాల్స్ నివాసుల సంఘం అధ్యక్షుడు అమోల్జాదవ్ అన్నారు. దక్షిణ ముంబైలోనే పునరావాసం కల్పించాలని కోరుతున్నామన్నారు. అయితే దక్షిణ ముంబైలో ట్రాంజిట్ క్యాంప్‌లు ఖాళీ లేకపోవడంతో అక్కడికి వెళ్లాల్సిందేనని బీఎంసీ హెచ్చరించింది. చివరకు నోటీసులు కూడా జారీచేసినప్పటికీ వారు ఖాళీ చేయలేదు.