సాక్షి, ముంబై: చర్నీరోడ్ ప్రాంతంలోని చందన్‌వాడి, బీఐటీ చాల్స్‌లోగల ఆరు భవనాలకు నగరపాలక సంస్థ (బీఎంసీ) నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ఆరు భవనాల్లో 680 కుటుంబాలు నివాసముంటున్నాయి. నివాసుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల వల్ల ఇక్కడ పునరాభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఈ ఆరు భవనాలు 50 సంవత్సరాలకు పైబడినవి. శిథిలావస్థకు చేరుకున్నట్లు ఇటీవల బీఎంసీ నిర్వహించిన స్ట్రక్చరల్ ఆడిట్‌లో కూడా తేలింది.
శిథిలావస్థలో ఉండడంవల్ల అవి ఎప్పుడైనా కూలే ప్రమాదముందని, వెంటనే ఖాళీ చేయాలని బీఎంసీ ఆదేశించింది. అయితే ఈ భవనాలు పటిష్టంగానే ఉన్నాయని, కేవలం మరుగు దొడ్లు, షెడ్లు మాత్రమే శిథిలావస్థకు చేరుకున్నాయని నివాసులంటున్నారు.. ఈ కుటుంబాలకు వాషినాకా, మాన్‌ఖుర్ద్, చెంబూర్ తదితర ట్రాంజిట్ క్యాంపుల్లో బీఎంసీ ఇళ్లు కేటాయించింది. వాటి పరిస్థితి కూడా ఇంచుమించు ఈ భవనాల లాగే ఉంది. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ కనీస సౌకర్యాలు లేవు.
అక్కడి నుంచి పనులకు వెళ్లడం, పిల్లలు స్కూలుకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో తాము అక్కడ ఉండలేమని చాల్స్ నివాసుల సంఘం అధ్యక్షుడు అమోల్‌జాదవ్ అన్నారు. దక్షిణ ముంబైలోనే పునరావాసం కల్పించాలని కోరుతున్నామన్నారు. అయితే దక్షిణ ముంబైలో ట్రాంజిట్ క్యాంప్‌లు ఖాళీ లేకపోవడంతో అక్కడికి వెళ్లాల్సిందేనని బీఎంసీ హెచ్చరించింది. చివరకు నోటీసులు కూడా జారీచేసినప్పటికీ వారు ఖాళీ చేయలేదు.
చందన్‌వాడీ, బీఐటీ చాల్స్‌కు నీరు, విద్యుత్ సరఫరా కట్
Published Thu, May 29 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement