దర్శకుడు గుణశేఖర్, ఇర్ఫాన్ ఖాన్
‘‘ఒక గొప్ప కళాకారుడు కన్ను మూసినప్పుడు ప్రపంచంలో గొప్ప సినిమా చేయాలనుకునే అందరికీ అది లాసే. ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటుడు ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం షాకింగ్ గా ఉంది. మరెన్నో గొప్ప సినిమాలు, గొప్ప పెర్ఫార్మన్స్‌లు చూసే అవకాశాన్ని మనందరం కోల్పోయాం’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఇర్ఫాన్ ఖాన్ యాక్ట్ చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘సైనికుడు’. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘పప్పు యాదవ్’ అనే విలన్ పాత్రలో నటించారాయన. ఇర్ఫాన్‌ని తెలుగు సినిమాలో నటింపజేసిన దర్శకుడు గుణశేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
► ఇర్ఫాన్ ఇక లేరనే వార్త వినగానే మీకు గుర్తొచ్చిన విషయాలు?
గుణశేఖర్: క్వారంటైన్ సమయంలో పాత క్లాసిక్స్ దగ్గర నుంచి మంచి మంచి సినిమాలన్నీ మళ్లీ చూస్తూ, ఇర్ఫాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో చేసిన ‘దృష్టి’ కూడా చూశాను. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. క్యాన్సర్ తో పోరాడి మళ్లీ మనందర్నీ తెరపై అలరిస్తారనుకున్నాను. ఇంతలో ఈ వార్త వినాల్సి వచ్చింది. నమ్మబుద్ధి కాలేదు. నమ్మాలనిపించలేదు.
‘సైనికుడు’ సినిమాలో మహేష్‌తో ఇర్ఫాన్
► ఇర్ఫాన్ ఖాన్‌ని ‘సైనికుడు’ సినిమాలో నటింపజేయాలని ఎందుకు అనిపించింది?
ఇర్ఫాన్ గొప్ప నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘దృష్టి’లో గజల్ సింగర్ గా చిన్న పాత్ర చేశారు. అందులో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రధారులు. ఇర్ఫాన్ ది చిన్న పాత్ర. కేవలం ఆ పాత్రతోనే దేశవ్యాప్తంగా తన మీద దృష్టి పడేలా చేసుకున్నారు. తర్వాత ‘సలాం బొంబాయి’ చేశారు. అది మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. బొంబాయిలో ఉన్న వీధి పిల్లలతో ఆ సినిమా చేశారు. అటు ఇటుగా అదే సమయంలో నేను చిన్నపిల్లలతో తీసిన ‘రామాయణం’ విడుదలయింది.
ఆయన ఎక్కువ శాతం ఆఫ్ బీట్ సినిమాలు చేస్తుండేవారు. కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని 2001 నుంచి ఆసక్తి చూపించారు. అదే సమయంలో సౌత్ నుంచి చాలా మంది ఆయన్ను ఇక్కడి సినిమాల్లో యాక్ట్ చేయించాలని ప్రయత్నించారు. మా సినిమాకు బావుంటారని మహేష్, నేను అనుకోవడంతో ఆయన్ను సంప్రదించాం. ఇర్ఫాన్ నన్ను కేవలం ‘ఒక్కడు’ సినిమా దర్శకుడిగా కాకుండా చిన్న పిల్లలతో ‘రామాయణం’ సినిమా చేసిన దర్శకుడిగా కూడా గుర్తు పెట్టుకున్నారు. అలా ఆయన మా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
► ఆయనతో పని చేసిన రోజుల గురించి?
ఆఫ్ బీట్ సినిమాలు చేసేవాళ్లు ఎక్కువ శాతం నేషనల్ స్కూల్ ఆఫ్ ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్లందరిలో సాధారణంగా కనిపించేది ఏంటంటే.. పాత్రను ఎక్కువగా స్టడీ చేయడం. అయితే ఇర్ఫాన్ ఆఫ్ బీట్ సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టేవారో కమర్షియల్ సినిమాలకూ అంతే శ్రమించేవారు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. ‘సైనికుడు’లో ‘పప్పు యాదవ్’ పాత్ర చేశారు. భాష రాని నటులు ఉంటే షూటింగ్ సమయంలో చిన్నఇబ్బంది ఉంటుంది. డైలాగ్స్ సరిగ్గా చెప్పలేని సందర్భాలు ఉంటాయి. ఆ డైలాగ్ కాకుండా వేరే లైన్స్ పలుకుతుంటారు. కానీ ఇర్ఫాన్ గారు ‘మమ’ అనిపించేద్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు. తెలుగు నేర్చుకుని, ప్రతి డైలాగ్ అర్థం ఏంటి? ఎలా పలకాలి? అని తెలుసుకుని, నటించారు. ‘సైనికుడు’లో ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ గారు, ఇర్ఫాన్ కాంబినేషన్ లో ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్లో ఇర్ఫాన్ తన డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా చెప్పడంతో కోటా గారు అభినందించారు.
► సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలేమైనా గుర్తు చేసుకుంటారా?
ఆరోగ్య విషయంలో ఇర్ఫాన్ చాలా జాగ్రత్తగా ఉండేవారు. ‘ఏ.యం.సి’ కుక్ వేర్ లో నూనె వాడకుండా వంట చేయొచ్చు. మా ఆవిడ (రాగిణి గుణ) ఆ పాత్రలను వాడుతుండేవారు. ఆ విధానం ఆయనకు బాగా నచ్చింది. ఆ పాత్రల గురించి మా ఆవిడ దగ్గర తెలుసుకొని హైదరాబాద్ నుంచి సామాగ్రి కొనుక్కొని తీసుకుని వెళ్లారు. అదో మంచి జ్ఞాపకం. ఆయన చనిపోయిన వార్త విని మా ఆవిడ కూడా షాక్ అయ్యారు.
► చాలామంది సెలబ్రిటీలు ఇర్ఫాన్ చనిపోవడం పర్సనల్ లాస్‌లా ఉంది అంటున్నారు..
అది నిజమే. ఎన్నో గొప్ప సినిమాలు చేశారాయన. ఇంకా ఎన్నో సినిమాలు మనకు అందిస్తారు, గొప్ప కథలు చెబుతారు, అద్భుతమైన ఆర్ట్‌ని ప్రపంచానికి చూపిస్తారని ఊహించాం. ఇక అది జరగదనే విషయం ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే పర్సనల్ లాస్ లా ఫీల్ అవుతున్నారు.
► ‘సైనికుడు’ చేస్తున్నప్పుడే ఆయనకు హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట కదా?
అవును. అప్పుడే ఆయనకు తొలి హాలీవుడ్ సినిమా ‘మైటీ హార్ట్’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్, మా డేట్స్ ఒకటే. దాంతో ఇర్ఫాన్ చాలా ప్రొఫెషనల్‌గా ‘ఒక హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. మన డేట్స్ ని మార్చడానికి వీలవుతుందా?’ అని అడిగారు. మహేష్ గారు, అశ్వనీ దత్ గారు, నేను మాట్లాడుకుని మొత్తం డేట్స్ అన్నీ మార్చేశాం. నెల రోజులు తర్వాత చేయాల్సిన షూటింగ్ ని ముందుకు మార్చి, 30 రోజుల పనిని 18 నుంచి 20 రోజుల్లో పూర్తి చేసి ఆయన్ను పంపించాం. ఆయన చాలా సంతోష పడ్డారు. హాలీవుడ్ ఆఫర్ అనేది ఆయనకు కొత్త ఇన్నింగ్స్. ఇర్ఫాన్ పొటెన్షియాల్టీకి తగ్గ కాన్వాస్ దొరికిందనుకున్నాను. ఆ తర్వాత ఆయనలా ఎవరికీ దొరకలేదు. హాలీవుడ్ హిట్ సినిమాలన్నిట్లో ఇర్ఫాన్ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. మనందరం గర్వపడే స్థాయికి వెళ్లారాయన.
Comments
Please login to add a commentAdd a comment