
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్(64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హర్యాణాలోని మేదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయన్ని సోమవారం మేఘాలయాకు తరలించనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. డోంకుపర్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కీలకమైన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. దీంతో ఆయన 2018లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
డోంకుపర్ రాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘మేఘాలయ స్పీకర్‌గా, మాజీ ముఖ్యమంత్రిగా డోంకుపర్ రాయ్ విశేషమైన సేవలు అందించారు. అదేవిధంగా మేఘాలయ అభివృద్ధికి కృషి చేశారు. చాలా మందికి సాయం అందించి వారి జీవితాలను మార్చారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతున్నాన’ని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా డోంకుపర్ అకాల మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి నాయకున్ని, మెంటర్‌ని కోల్పోయామని తెలిపారు. ఆయన ఎంతో మందికి అంకితభావంతో సేవ చేశారని పేర్కొన్నారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.