ఆమె పోరాటం ముగిసింది! | Indian woman set on fire on way to hearing dies | Sakshi
Sakshi News home page

ఆమె పోరాటం ముగిసింది!

Dec 8 2019 3:45 AM | Updated on Dec 8 2019 1:16 PM

Indian woman set on fire on way to hearing dies - Sakshi

స్త్రీలపై అరాచకాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలో ర్యాలీలో ఓ మహిళ ఆక్రందన

న్యూఢిల్లీ/లక్నో/ఉన్నావ్‌: నేరస్తుల బెదిరింపులు.. స్పందించని ప్రభుత్వం.. చలించని పోలీసులు..ఇలా అడ్డంకులెన్ని ఎదురైనా వెరవకుండా న్యాయం కోసం ముందుకు సాగిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి(23) జీవన పోరాటం ముగిసింది. దాదాపు 40 గంటల పాటు మృత్యువుతో పోరాడి, ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. తనపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై గురువారం ఉదయం నిందితులు పెట్రోల్‌ పోసి, నిప్పంటించిన విషయం తెలిసిందే.

90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసింది. కుటుంబసభ్యులు శనివారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆమె మృతిపై విపక్షాలు భగ్గుమన్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని, బాధితురాలికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టి, త్వరలోనే బాధితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.   

వెంటాడి చంపాలి: మృతురాలి తండ్రి
తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటాడి, చంపాలని మృతురాలి తండ్రి ఆవేశంతో అన్నారు. ‘మాకు డబ్బూ వద్దు. ఎలాంటి సాయమొద్దు. హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ మాదిరి దోషుల్ని కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలి’అని అన్నారు. తన సోదరి మరణానికి కారణమైన దోషులకు జీవించే హక్కు లేదని బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దోషులంతా చస్తేనే నా సోదరికి న్యాయం జరిగినట్లవుతుంది. ఆ కిరాతకులందరినీ యమపురికి పంపాలి’అని అన్నారు.

అత్యాచారాల రాజధానిగా భారత్‌: రాహుల్‌
దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంకా గాంధీ
ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలికి న్యాయం అందించడంలో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రియాంక శనివారం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమెకు న్యాయం దక్కకపోవడానికి ప్రతి ఒక్కరిదీ బాధ్యతేనన్నారు.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: మాయావతి
మహిళలపై పెరుగుతున్న నేరాలను సుమోటోగా పరిగణించి, వీటికి అడ్డుకట్టపడేలా కేంద్రానికి తగు సూచనలివ్వాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టును కోరారు. మాయావతి శనివారం యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ను కలిశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్ననేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

యోగి ప్రభుత్వాన్ని తొలగించాలి: అఖిలేశ్‌
‘ఉన్నావ్‌’బాధితురాలికి రక్షణ కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విఫలమైందంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. ఇది చీకటి దినమనీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి సాయం అందించారు? మీరు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? అని నిలదీశారు.

పోస్టుమార్టం నివేదిక ఏం చెప్పింది?
ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి మృతదేహానికి సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి వైద్యులు శనివారం పోస్టుమార్టం జరిపారు. ‘తీవ్రంగా కాలిన గాయాల కారణంగా బాధితురాలు చనిపోయింది. విష ప్రయోగం, మారణాయుధాలు, ఊపిరాడకపోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు ఆధారాలు కనిపించలేదు’అని వైద్యుడొకరు చెప్పారు. ‘శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించింది. రాత్రి 11 గంటలపుడు అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. గుండెను తిరిగి పని చేయించడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. 11.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచింది’అని ఆస్పత్రి వైద్యుడు శలబ్‌ కుమార్‌ ప్రకటించారు.


మృతురాలి ఇంటివద్ద జనం.


బాధితురాలి బంధువులను పరామర్శించి వస్తున్న ప్రియాంక గాంధీ.


మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement