తొలి బాండ్‌ సీన్‌ కానరీ ఇక లేరు | James Bond actor Sean Connery passes away at 90 | Sakshi
Sakshi News home page

తొలి బాండ్‌ సీన్‌ కానరీ ఇక లేరు

Published Sun, Nov 1 2020 12:20 AM | Last Updated on Sun, Nov 1 2020 8:39 AM

James Bond actor Sean Connery passes away at 90 - Sakshi

ఆయన బాండ్‌ వేషమేస్తే అదో బ్రాండ్‌ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్‌ ‘సెక్సియస్ట్‌ మ్యాన్‌’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్‌ నటుడు సీన్‌ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్‌ కానరీ జీవిత విశేషాలు.

బాండ్‌కి బ్రాండ్‌
సీన్‌ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్‌ లభించింది జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్‌ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్‌ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్‌ పాత్రలో కనిపించారు సీన్‌ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’, ‘గోల్డ్‌ ఫింగర్‌’, ‘తండర్‌బాల్‌’, ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’, ‘డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’, ‘నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌’ సినిమాల్లో బాండ్‌ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యాయి. అయితే ‘బాండ్‌ జేమ్స్‌ బాండ్‌’ అంటూ తెరపై సందడి చేసిన సీన్‌ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట.

అయితే చివరికి రిస్క్‌ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్‌ చేస్తే.. సూపర్‌ బాండ్‌ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్‌ నవలా రచయిత ఇయామ్‌ ఫ్లెమింగ్‌ మాత్రం ఈ పాత్రకు సీన్‌ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్‌ నో’ ప్రీమియర్స్‌ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట.


బాండ్‌ అంటే చిరాకొచ్చింది

బాండ్‌ పాత్రకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్‌ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్‌గానే ఎక్కువగా పేరు రావడం సీన్‌ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్‌.


బియాండ్‌ బాండ్‌
బాండ్‌ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘మేల్‌’, ‘ది మ్యాన్‌ హూ ఉడ్‌ బీ కింగ్‌’, ‘ది విండ్‌ అండ్‌ ది లైన్‌’, ‘ది అన్‌టచబుల్స్‌’, ‘ది నేమ్‌ ఆఫ్‌ ది రోజ్‌’, ‘ఇండియన్‌ జోన్స్‌ అండ్‌ ది లాస్ట్‌ క్రూసేడ్‌’ సినిమాల్లో సీన్‌ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్‌’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు సీన్‌ కానరీ.

రిటైర్మెంట్‌
2007లో అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీన్‌ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్‌ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్‌ అంటే జోక్‌ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్‌ బిల్లీ’ అనే యానిమేషన్‌ చిత్రంలో సర్‌ బిల్లీ పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారాయన.

వ్యక్తిగత జీవితం
1930 ఆగస్ట్‌ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్‌ కానరీ. తండ్రి లారీ డ్రైవర్‌. తల్లి క్లీనింగ్‌ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్‌ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్‌. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్‌లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్‌ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్‌ మీద దృష్టిపెట్టారు.  మోడలింగ్‌ చేస్తూ, మిస్టర్‌ యూనివర్స్‌ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్‌ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్‌ చేశారు.

1954లో ‘లైలాక్స్‌ ఇన్‌ ది స్ప్రింగ్‌’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్‌ బ్యాక్‌’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్‌ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్‌ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్‌ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్‌ పెయింటర్‌ మైక్లిన్‌ రోక్బ్రూన్‌ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్‌ కానరీ అనే కుమారుడు ఉన్నాడు.

ప్రశాంతంగా కన్నుమూశారు
ఈ ఏడాది ఆగస్ట్‌ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్‌ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్‌ తనయుడు జాసన్‌ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్‌ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్‌’’ అని పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్‌ బాబు, అభిషేక్‌ బచ్చన్‌ తదితరులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు.

సెక్స్‌ సింబల్‌
సీన్‌ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్‌’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్‌ లివింగ్‌ స్కాట్‌’గా ఓటు వేయబడ్డారు సీన్‌. ‘స్కాంట్‌ల్యాండ్‌ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్‌ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్‌’ మేగజీన్‌ అయితే ‘సెక్సియస్ట్‌ మేన్‌ ఎలైవ్‌’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్‌ మేన్‌’ అని బిరుదులు ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement