Sean Connery
-
జేమ్స్ బాండ్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పెట్టింది. జేమ్స్‌బాండ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కానరీ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాండ్ జేమ్స్ బాండ్ అంటూ ఆయన పేరు దేశ విదేశాలలో మారుమ్రోగింది. అందుకే ఆయన గౌరవార్థం, ది నేమ్ ఆఫ్ ద రోజ్’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రనాయిడ్కు సీన్ కానరీ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది. సీన్ కానరీ 1979లో మీటియర్ (ఉల్కపాతం) అనే చిత్రంలో నటించారు. గ్రహశకలం, భూమిని ఢీకొట్టకుండా నాసా ఎలా కాపాడింది అనే నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కానరీ ముఖ్యపాత్ర పోషించారు. నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి కంటే దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్రను పోషించారు అని నాసా సోమవారం తాను చేసిన ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదిలా వుండగా అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్‌కానరీ పేరును పెట్టింది. ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్‌గా ఉందని ఆ ఉల్క గురించి నాసా అభివర్ణించింది. లెమ్మన్ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా ఇటీవల తన ట్విటర్ ద్వారా షేర్ చేసింది. జేమ్స్ బాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సీన్ కానరీ 90 ఏళ్ల వయసులో అక్టోబర్ 31వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. Sir Sean Connery starred in the movie “Meteor” where he led NASA's efforts to defend Earth against an #asteroid impact threat...decades before @NASA appointed its first #PlanetaryDefense Officer! https://t.co/DVCBeRQLgQ — NASA Asteroid Watch (@AsteroidWatch) November 1, 2020 చదవండి: తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
జేమ్స్ బాండ్ హీరో కన్నుమూత
బహమాస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్ బాండ్ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సీన్ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. -
కొత్త జేమ్స్ బాండ్ హీరో ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్ నెలలో విడుదల కానున్న డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ చిత్రం ‘బాండ్ 25’ ఆయనకు ఆఖరి బాండ్ చిత్రం కానుంది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ‘నావెల్ ఇంటెలిజెన్స్ డివిజన్’లో పనిచేసిన బ్రిటన్ రచయిత ఐయాన్ ఫ్లెమింగ్, జేమ్స్ బాండ్ నవలల సృష్టికర్త. ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినప్పుడు తారసపడిన పలువురు గూఢచారలను దృష్టిలో పెట్టుకొని జేమ్స్ బాండ్ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన పాత్ర ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’గా కన్నా ‘ప్లేబోయ్’గానే ఎక్కువగా కనిపిస్తుంది. ‘007’ కోడ్ నేమ్ కలిగిన జేమ్స్ బాండ్, ఎం16గా పిలిచే బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేసే పాత్ర. ఈ పాత్రను ప్రధానంగా తీసుకొని ఐయాన్ ఫ్లెమింగ్ 1953 నుంచి 1966 మధ్య 12 జేమ్స్ బాండ్ నవలలు, రెండు చిన్న కథల సంపుటాలు రాశారు. ఆయన అన్ని నవలలను సినిమాలుగా తీసిన తర్వాత ఆయన చిన్న కథల ఆధారంగా ఇతర రచయితలు బాండ్ నవలలను రాయగా వాటిని కూడా సినిమాలుగా తీశారు. వాటిలో కాసినో రాయల్ (1953), లివ్ అండ్ లెట్డై (1954), మూన్‌రేకర్ (1955), డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ (1956), ఫ్రమ్ రష్యా, విత్ లౌ (1957), డాక్టర్ నో (1958), గోల్డ్ ఫింగర్ (1959), ఫర్ యువర్ ఐస్ ఓన్లీ (1960), థండర్ బాల్ (1961), ది స్పై వూ లవ్డ్ మీ (1963), ఆన్ హర్ మేజెస్ట్రీస్ సీక్రెట్ సర్వీస్ (1963), యూ ఓన్లీ లీవ్ ట్వైస్, (1964), ది మేన్ విత్ గోల్డెన్ గన్ (1965), ఆక్టోపసీ, లీవింగ్ డే లైట్స్ (1966) తదితర నవలు, కథలు సినిమాలుగా వచ్చాయి. ఐయాన్ ఫ్లెమింగ్‌కు కొనసాగింపుగా కింగ్స్లే ఆమిస్, జాన్ పియర్సన్, క్రిస్టోఫర్ వుడ్, జాన్ గార్డనర్ తదితర రచయితలు బాండ్ నవలలు రాశారు. సినిమాలుగా రాకముందే చాలా బాండ్ పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. మొట్టమొదటి బాండ్ చిత్రాల హీరోగా శాన్ కానరీ ఎంపికయ్యారు. అయితే ఆయన వయస్సు మీరిన స్టంట్ మేన్‌గా కనిపించడంతో ముందుగా ఐయాన్ ప్లెమింగ్‌కు ఆయన నచ్చలేదట. సినిమా విడుదలయ్యాక ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. శాన్ కానరీ చురుకైనా స్కాటిష్ చూపులు, ముఖంలో ఉండే తేజస్సు, ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయన స్టైల్ ఆయన్ని మంచి కరిష్మాటిక్ నటుడిగా నిలబెట్టాయి. దాంతో ఆయన తొలి ఐదు బాండ్ చిత్రాల్లో వరుసగా నటించి, ఆ తర్వాత మరో రెండు బాండ్ చిత్రాల్లో నటించారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్ సినిమాల్లో వరుసగా నటించిన ఆయన కొన్నేళ్ల విరామం అనంతరం డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సే నెవర్ అగేన్ చిత్రాల్లో నటించారు. శాన్ కానరీయే ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ ఆధరణ పొందిన బాండ్ నటుడిగా చరిత్రలో మిగిలిపోయారు. అంతేకాకుండా ఆయన్ని సినిమా చరిత్రలోనే మూడవ అతి గొప్ప నటుడిగా అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఎంపిక చేసింది. 1969లో శాన్ కానరీకి విరామం ఇచ్చి బ్రాండ్ చిత్రాల నిర్మాత బార్బర బ్రొకోలీ ‘ఆన్ హర్ మాజెస్టీస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో 29 ఏళ్ల ఆస్ట్రేలియా నటుడు, మోడల్ జార్జ్ లాజెన్బైని తీసుకున్నారు. బాండ్ చిత్రాల్లో అత్యంత పిన్న వయస్కుడైన లాజెన్బై ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆ తర్వాత శాన్ కానరీకి నిజమైన వారసుడిగా 1973లో లీవ్ అన్ లెట్ డై సినిమాతో రోజర్ జార్జ్ మోర్ వచ్చారు. ఏడు బాండ్ చిత్రాల్లో నటించిన ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే, 12 ఏళ్లపాటు కొనసాగిన బాండ్ హీరోగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇంగ్లీషు నటుడు టిమోతి డాల్టన్ రెండు చిత్రాల్లో, ఐరిస్ నటుడు పియర్స్ బ్రాస్నన్ నాలుగు చిత్రాల్లో, ప్రస్తుత ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ ఐదు చిత్రాల్లో నటించారు. వీరంతా శ్వేత జాతీయులు, వారిలో ఎక్కువ మంది ఇంగ్లీషు నటులు. కొత్త జేమ్స్ బాండ్‌కు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏ దేశం, ఏ జాతికి చెందిన వ్యక్తయినా తనకు ఫర్వా లేదని బార్బర బ్రొకోలీ ఇటీవల ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాంతో నల్ల జేమ్స్ బాండ్ ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తలెత్తింది. ఆకర్షణీయంగా కనిపించే నల్లజాతీయ ఇంగ్లీషు నటుడు ఇద్రీస్ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారు. డెంజల్ వాషింగ్టన్, మోర్గాన్ ఫ్రీమన్, విల్‌స్మిత్ లాంటి నల్లజాతీయులు హాలీవుడ్లో రాణించినప్పుడు ఇద్రీస్ ఎల్బా ఎందుకు రాణించరని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్వేతజాతీయుడి స్థానంలో ఓ నీగ్రోను ప్రేక్షకులు అంగీకరిస్తారా? హాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాండ్ గర్ల్స్‌గా అకికో వాకబయాషి, గ్లోరియా ఎండ్రీ, గ్రేస్ జోన్స్, మిచెల్లీ యెయో లాంటి వివిధ జాతులకు చెందిన మహిళలను తీసుకున్నప్పుడు బాండ్ హీరోగా ఓ నీగ్రో ఎందుకు తీసుకోకూడదన్నదే ప్రశ్న. -
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి కన్నుమూత
ఉత్తమ జేమ్స్ బాండ్ సినిమాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు గాయ్ హమిల్టన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 'బాండ్' హీరో సీన్ కానరీతో 'గోల్డ్ ఫింగర్', 'డైమండ్స్ ఆర్ ఫరెవర్' సినిమాలను రూపొందించిన ఆయన రోజర్ మూర్తో కలిసి 'లివ్ అండ్ లెట్ డై', 'ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్' వంటి జేమ్స్ బాండ్ సినిమాలను అందించాడు. హమిల్టన్ మృతిపై బాండ్ హీరో రోజర్ మూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వండర్ ఫుల్ డైరెక్టర్ అయిన హమిల్టన్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని, అత్యద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని ఆయన అన్నారు. బాండ్ సినిమాలతోపాటు పలు ప్రముఖ బ్రిటిష్ చిత్రాలకు హమిల్టన్ దర్శకత్వం వహించాడు. 'బ్యాటల్ ఆఫ్ బ్రిటన్', 'ఫునెరల్ ఇన్ బెర్లిన్', ఫోర్స్ 10'తోపాటు అగాథా క్రిస్టీ రచనల ఆధారంగా తీసిన 'ద మిర్రర్ క్రాక్డ్', 'ఈవిల్ అండర్ ద సన్' చిత్రాలను తెరకెక్కించాడు.