కొత్త జేమ్స్‌ బాండ్‌ హీరో ఎవరు? | Who Is New James Bond | Sakshi
Sakshi News home page

కొత్త జేమ్స్‌ బాండ్‌ హీరో ఎవరు?

Published Mon, Sep 3 2018 2:46 PM | Last Updated on Mon, Sep 3 2018 2:48 PM

Who Is New James Bond - Sakshi

ఇద్రీస్‌ ఎల్బా, డేనియల్‌ క్రేగ్‌, శాన్‌ కానరీ

సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్‌ నెలలో విడుదల కానున్న డేనియల్‌ క్రేగ్‌ నటించిన జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘బాండ్‌ 25’ ఆయనకు ఆఖరి బాండ్‌ చిత్రం కానుంది. ఆ తర్వాత వచ్చే బాండ్‌ చిత్రాల్లో జేమ్స్‌ బాండ్‌గా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ‘నావెల్‌ ఇంటెలిజెన్స్‌ డివిజన్‌’లో పనిచేసిన బ్రిటన్‌ రచయిత ఐయాన్‌ ఫ్లెమింగ్, జేమ్స్‌ బాండ్‌ నవలల సృష్టికర్త. ఆయన తన ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసినప్పుడు తారసపడిన పలువురు గూఢచారలను దృష్టిలో పెట్టుకొని జేమ్స్‌ బాండ్‌ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన పాత్ర ‘కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డరర్‌’గా కన్నా ‘ప్లేబోయ్‌’గానే ఎక్కువగా కనిపిస్తుంది.

‘007’ కోడ్‌ నేమ్‌ కలిగిన జేమ్స్‌ బాండ్, ఎం16గా పిలిచే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేసే పాత్ర. ఈ పాత్రను ప్రధానంగా తీసుకొని ఐయాన్‌ ఫ్లెమింగ్‌ 1953 నుంచి 1966 మధ్య 12 జేమ్స్‌ బాండ్‌ నవలలు, రెండు చిన్న కథల సంపుటాలు రాశారు. ఆయన అన్ని నవలలను సినిమాలుగా తీసిన తర్వాత ఆయన చిన్న కథల ఆధారంగా ఇతర రచయితలు బాండ్‌ నవలలను రాయగా వాటిని కూడా సినిమాలుగా తీశారు. వాటిలో కాసినో రాయల్‌ (1953), లివ్‌ అండ్‌ లెట్‌డై (1954), మూన్‌రేకర్‌ (1955), డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌ (1956), ఫ్రమ్‌ రష్యా, విత్‌ లౌ (1957), డాక్టర్‌ నో (1958), గోల్డ్‌ ఫింగర్‌ (1959), ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ (1960), థండర్‌ బాల్‌ (1961), ది స్పై వూ లవ్డ్‌ మీ (1963), ఆన్‌ హర్‌ మేజెస్ట్రీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (1963), యూ ఓన్లీ లీవ్‌ ట్వైస్, (1964), ది మేన్‌ విత్‌ గోల్డెన్‌ గన్‌ (1965), ఆక్టోపసీ, లీవింగ్‌ డే లైట్స్‌ (1966) తదితర నవలు, కథలు సినిమాలుగా వచ్చాయి.

ఐయాన్‌ ఫ్లెమింగ్‌కు కొనసాగింపుగా కింగ్‌స్లే ఆమిస్, జాన్‌ పియర్సన్, క్రిస్టోఫర్‌ వుడ్‌, జాన్‌ గార్డనర్‌ తదితర రచయితలు బాండ్‌ నవలలు రాశారు. సినిమాలుగా రాకముందే చాలా బాండ్‌ పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. మొట్టమొదటి బాండ్‌ చిత్రాల హీరోగా శాన్‌ కానరీ ఎంపికయ్యారు. అయితే ఆయన వయస్సు మీరిన స్టంట్‌ మేన్‌గా కనిపించడంతో ముందుగా ఐయాన్‌ ప్లెమింగ్‌కు ఆయన నచ్చలేదట. సినిమా విడుదలయ్యాక ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. శాన్‌ కానరీ చురుకైనా స్కాటిష్‌ చూపులు, ముఖంలో ఉండే తేజస్సు, ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయన స్టైల్‌ ఆయన్ని మంచి కరిష్మాటిక్‌ నటుడిగా నిలబెట్టాయి. దాంతో ఆయన తొలి ఐదు బాండ్‌ చిత్రాల్లో వరుసగా నటించి, ఆ తర్వాత మరో రెండు బాండ్‌ చిత్రాల్లో నటించారు.

డాక్టర్‌ నో, ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్, గోల్డ్‌ ఫింగర్, థండర్‌బాల్, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌ సినిమాల్లో వరుసగా నటించిన ఆయన కొన్నేళ్ల విరామం అనంతరం డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్, నెవర్‌ సే నెవర్‌ అగేన్‌ చిత్రాల్లో నటించారు. శాన్‌ కానరీయే ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ ఆధరణ పొందిన బాండ్‌ నటుడిగా చరిత్రలో మిగిలిపోయారు. అంతేకాకుండా ఆయన్ని సినిమా చరిత్రలోనే మూడవ అతి గొప్ప నటుడిగా అమెరికా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఎంపిక చేసింది. 1969లో శాన్‌ కానరీకి విరామం ఇచ్చి బ్రాండ్‌ చిత్రాల నిర్మాత బార్బర బ్రొకోలీ ‘ఆన్‌ హర్‌ మాజెస్టీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ చిత్రంలో 29 ఏళ్ల ఆస్ట్రేలియా నటుడు, మోడల్‌ జార్జ్‌ లాజెన్‌బైని తీసుకున్నారు. బాండ్‌ చిత్రాల్లో అత్యంత పిన్న వయస్కుడైన లాజెన్‌బై ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆ తర్వాత శాన్‌ కానరీకి నిజమైన వారసుడిగా 1973లో లీవ్‌ అన్‌ లెట్‌ డై సినిమాతో రోజర్‌ జార్జ్‌ మోర్‌ వచ్చారు. ఏడు బాండ్‌ చిత్రాల్లో నటించిన ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే, 12 ఏళ్లపాటు కొనసాగిన బాండ్‌ హీరోగా రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత ఇంగ్లీషు నటుడు టిమోతి డాల్టన్‌ రెండు చిత్రాల్లో, ఐరిస్‌ నటుడు పియర్స్‌ బ్రాస్నన్‌ నాలుగు చిత్రాల్లో, ప్రస్తుత ఇంగ్లీష్‌ నటుడు డేనియల్‌ క్రేగ్‌ ఐదు చిత్రాల్లో నటించారు. వీరంతా శ్వేత జాతీయులు, వారిలో ఎక్కువ మంది ఇంగ్లీషు నటులు. కొత్త జేమ్స్‌ బాండ్‌కు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏ దేశం, ఏ జాతికి చెందిన వ్యక్తయినా తనకు ఫర్వా లేదని బార్బర బ్రొకోలీ ఇటీవల ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాంతో నల్ల జేమ్స్‌ బాండ్‌ ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తలెత్తింది. ఆకర్షణీయంగా కనిపించే నల్లజాతీయ ఇంగ్లీషు నటుడు ఇద్రీస్‌ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారు. డెంజల్‌ వాషింగ్టన్, మోర్గాన్‌ ఫ్రీమన్, విల్‌స్మిత్‌ లాంటి నల్లజాతీయులు హాలీవుడ్‌లో రాణించినప్పుడు ఇద్రీస్‌ ఎల్బా ఎందుకు రాణించరని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే శ్వేతజాతీయుడి స్థానంలో ఓ నీగ్రోను ప్రేక్షకులు అంగీకరిస్తారా? హాలీవుడ్‌ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాండ్‌ గర్ల్స్‌గా అకికో వాకబయాషి, గ్లోరియా ఎండ్రీ, గ్రేస్‌ జోన్స్, మిచెల్లీ యెయో లాంటి వివిధ జాతులకు చెందిన మహిళలను తీసుకున్నప్పుడు బాండ్‌ హీరోగా ఓ నీగ్రో ఎందుకు తీసుకోకూడదన్నదే ప్రశ్న.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement