రిషీ కపూర్
షో బిజ్ లో ఒకలాంటి డాబు ఉంటుంది. తప్పక కృత్రిమంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో మాటలకు షుగర్ కోటింగ్ వేసి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. రిషీ కపూర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేయడమే. నచ్చింది చెప్పేయడమే. తన బయోగ్రఫీలోనూ అదే పాటించారు. మనసుకు ఫిల్టర్ వేయకుండా మనసులో ఉన్నదంతా ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. 2017లో ఈ పుస్తకం విడుదలైంది. ఆటోబయోగ్రఫీ ‘ఖుల్లమ్ ఖుల్లా: రిషి కపూర్ అన్ సెన్సార్డ్’ పుస్తకంలో రిషి కపూర్ రాసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
నేను అదృష్టవంతుణ్ణి
మా కుటుంబం కూడా ఆకాశం లానే. ఇంట్లో ఎంతో మంది స్టార్స్. నా జన్మ నక్షత్రం కూడా అద్భుతమైనది. నేను అదృష్టవంతుణ్ణి. పృథ్వీ రాజ్ కపూర్ కి మనవడిని అయినందుకు, రాజ్ కపూర్ లాంటి తండ్రికి కొడుకు అయినందుకు, నీతూ లాంటి భార్య ఉన్నందుకు, రిద్ధిమా, రణ్ బీర్ లాంటి పిల్లలు పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని. నేనెప్పుడూ అదృష్టవంతుడినే.
నా బాల్యం
నా బాల్యం అంతా సినిమాలతోను, సినిమాల చుట్టూను తిరిగింది. సినిమా కథలు వింటూనే పెరిగాను. కపూర్ ఫ్యామిలీ మొత్తంలో అతి చిన్న వయసులో కెమెరా ముందుకు వచ్చింది నేనే. నాన్నగారు నటించిన ‘శ్రీ 420’ సినిమాలోని ‘ప్యార్ హువా...’ పాటలో వచ్చే ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ణి నేను. మిగతా ఇద్దరు రణ్ ధీర్ కపూర్, రీతూ కపూర్. ఆ పాట మొత్తం వర్షంలో సాగుతుంటుంది. వర్షపు నీరు నా కంట్లో పడటంతో ఏడ్చేవాణ్ణి. ‘మీ నాన్న గారు చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా’ అని నాతో ఆ సన్నివేశం పూర్తి చేయించారు ఆ సినిమా హీరోయిన్ నర్గీస్ జీ.
ఆదివారం మాత్రమే ఆ సినిమా చేశా
నాన్నగారు ప్లాన్ చేసిన ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర నాతో చేయించాలనుకున్నారు. అయితే మా అమ్మ మాత్రం కొన్ని షరతులతో నన్ను సినిమాలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకున్నారు. అవేంటి అంటే.. నా చదువుకి ఇబ్బంది కలగకూడదు, స్కూల్లో నా అటెండెన్స్ తగ్గకూడదు. ‘షూటింగ్ మొత్తం ఆదివారం చేస్తా’ అన్నారు నాన్న. వాళ్ల సంభాషణ చాలా క్యాజువల్ గా సాగింది. కానీ నాకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగింది. స్క్రిప్ట్ తీసుకొని నా రూమ్ లోకి వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత సంతకం ఎలా పెట్టాలో నేర్చుకున్నా. సూపర్ స్టార్ అయ్యాక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కదా.
కందిన చెంపతో ఏడ్చాను
‘మేరా నామ్ జోకర్’లో ఓ సన్నివేశంలో నా తల్లి పాత్ర చేసిన ఆమె నా చెంప చెళ్లుమనిపించాలి. ఆ సీన్ సరిగ్గా రావడానికి 9 టేకులయింది. దెబ్బకు నా చెంప ఎర్రగా కందిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను.. మా నాన్న తన పనిలో నిమగ్నమైపోయారు. అప్పుడు అర్థమయింది.. సెట్లోకి అడుగుపెట్టేంతవరకే ఆయన నా తండ్రి అని అడుగు పెట్టాక ఫిలిం మేకర్ అని.
పాకెట్ మనీ ట్రిక్
రాజ్ కపూర్ పిల్లలంటే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ముంబయి లోని ఓ పాపులర్ హోటల్ కి నాన్నగారు తరచూ వెళ్లే వారు. నేను ఆ హోటల్ కి వెళ్తే బిల్ ఆయన అకౌంట్ లో చెల్లించడం అలవాటు. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లినా బిల్ ఆయన ఖాతాయే. కానీ మా ఫ్రెండ్స్ మధ్య రూల్ ఏంటంటే.. ఎప్పుడూ బిల్ షేర్ చేసుకోవాలి. వాళ్ల వాటా డబ్బులు నేను తీసుకొని బిల్ మొత్తం నాన్న అకౌంట్ లో కట్టేసేవాడిని. ఫ్రెండ్స్ వాటా డబ్బులు పాకెట్ మనీలా నా జేబులో వేసుకునేవాణ్ణి.
నీతూని నిందించాను
1980లో నీతు, నా పెళ్లి జరిగిన తర్వాత నా సినిమాలు ‘కర్జ్, జమానా కో దికానా హే’ దారుణంగా విఫలమయ్యాయి. పెళ్లి అవడంతో నా రొమాంటిక్ హీరో ట్యాగ్ పోయిందనుకున్నాను. దానికి కారణం నీతూనే అని తనని నిందించాను. డిప్రెషన్‌లోకి వెళ్లా. కెమెరాకు, పబ్లిక్‌కి మొహం చూపించే ధైర్యం లేకుండా పోయింది. అప్పుడు నీతు కడుపుతో ఉంది. నా డిప్రెషన్ ని ఎలా తట్టుకుందో అని ఆశ్చర్యంగా ఉంటుంది. నాతో ఇన్నాళ్లు కలసి ఉన్నందుకు నీతూకి అవార్డు ఇవ్వాలి అని మా అమ్మ, అక్క అంటుంటారు. అది నిజమే. నా తీరుని మార్చాలని తను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా చిరాకుని తట్టుకుంది. నా మూడ్ కి తగ్గట్టు తను ఉండేది. ఎంతో సహనం వహించింది. నేను, నీతు గొడవపడేవాళ్లం (అందులో చాలాసార్లు తప్పు నాదే అయ్యుంటుంది). కొన్నిసార్లు 6 నెలల వరకు మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సమస్యలను కలిసే పరిష్కరించుకున్నాం.
నాలో పురుషాహంకారి ఉన్నాడు
పెళ్లికి ముందు మా ఇద్దరిలో ఒకరు సంపాదిస్తూ, మరొకరు పిల్లలను చూసుకోవాలనుకున్నాం. నీతు యాక్టింగ్ మానేస్తా అన్నప్పుడు మాట వరసకు కూడా నేను వద్దనలేదు. ‘తన భార్య పని చేయకూడదని నాలో ఉన్నపురుషాహంకారి అలా చేశాడేమో?’. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం (పుస్తకం రాస్తున్నసమయానికి) చాలా మారింది.
అవార్డు కొన్నందుకు సిగ్గుపడుతున్నా
అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయంతే. నా ‘బాబీ’ విడుదలైన సంవత్సరం (1973)లోనే అమితాబ్ బచ్చ¯Œ ‘జంజీర్’ కూడా విడుదలైంది. ‘బాబీ’ సినిమాకి నాకు బెస్ట్ అవార్డు వచ్చినందుకు అమితాబ్ బాధపడతాడని అనుకున్నాను. ఎందుకంటే ‘జంజీర్’ కోసం తనకి అవార్డు రావాలనుకుని ఉంటాడేమో. అయితే నేను అవార్డు కొనుక్కున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజానికి అవార్డు కొని, మ్యానిపులేట్ చేయాలనుకునే వ్యక్తిని కాదు నేను. అయితే దేని గురించీ ఆలోచించని వయసులో ఉన్నాను. అవార్డు ప్రతినిధి ‘30వేలు ఇవ్వండి. అవార్డు మీది అవుతుంది’ అనడంతో, వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేశా. అలా అవార్డు దక్కించుకున్నందుకు ఎప్పటికీ గిల్టీగా ఉంటుంది.
నా ప్రాధాన్యత ఎప్పుడూ రిషీయే
‘‘ఎప్పుడైనా రిషి నుంచి విడిపోవాలనే ఆలోచన వచ్చిందా?’’ అని నన్ను అడిగితే ‘‘చాలాసార్లు. ప్రతిరోజూ’’ అని సమాధానం చెబుతాను నేను సరదాగా.
ఎందుకంటే.. ఇతనితో తప్ప నేను వేరే ఎవ్వరితోను ఉండలేనేమో?
ఎందుకంటే... తెలుసుకున్న కొద్దీ గొప్పగా కనిపించే వ్యక్తి రిషి.
ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతని గొప్ప లక్షణాల ముందు అతని చెడ్డ అలవాట్లు కనిపించనంత చిన్నగా మారిపోతున్నాయి.
నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే.. రిషీని పెళ్లి చేసుకోవడం. రిషి చాలా కష్టమైన మనిషి. అది ఆయన్ను అర్థం చేసుకునేంత వరకే. కొత్తవాళ్లను సులభంగా నమ్మడు. అందుకే అతని చుట్టూ ఎప్పుడూ పాత ముఖాలే. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ఇవాళ్టికి (పుస్తకం రాస్తున్న సమయానికి) నేను , రిషి ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా మారింది. ఆయన ముఖంలో చిన్న మార్పు చూసి ఆయన మనసును అర్థం చేసుకోగలను. నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే రిషీయే నాకు ఎక్కువ. అతనితో పోలిస్తే ఎవ్వరూ ఎక్కువ కాదు. బాబ్ (రిషీని నీతూ అలానే పిలుస్తారు)కి సినిమాలంటే పిచ్చి. కుటుంబం అంటే పిచ్చి. నా కుటుంబమే నాకు ప్రపంచం. అందుకే సినిమాలా? కుటుంబమా? అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇష్టంగా ఇంట్లోనే ఉండాలనుకున్నా.
నాన్నతో మరింత టైమ్ గడిపి ఉండాల్సింది
(తండ్రి ఆటోబయోగ్రఫీ ముందు మాటలో రణ్ బీర్ పేర్కొన్న విషయాలివి)
నాకు మా నాన్నతో కంటే అమ్మతో దగ్గరితనం ఎక్కువ. నాన్నతో చాలా గౌరవమైన బంధమే ఉండేది. కానీ కొన్నిసార్లు నాన్నతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది అనిపించేది. ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కూడా ఉంది. ఏదో ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగి ఉండాల్సింది అనిపిస్తుంటుంది.
మా పిల్లలతో నేను ఇలా ఉండను.. కచ్చితంగా వారికి సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా అంటున్నప్పటికీ మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ‘మన ఫ్యామిలీని బలంగా కలిపి ఉంచినది, మన అందరి జీవితాలను సులభం చేస్తున్నది మీ అమ్మ (నీతూ కపూర్) మాత్రమే’ అని చాలా స్పష్టంగా చెప్పేవారు నాన్న. వాళ్ల ఇద్దరి నుంచే ప్రేమ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి? అనే విషయాలు నేర్చుకున్నాను. చేసే పనిని ఎలా ప్రేమించాలో నేర్పించారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో నాన్న నాకంటే ఉత్సాహంగా షూటింగ్స్ కి వెళ్లడం చూశాను. నా మీద ఆయనకు ఉన్న గౌరవం చూస్తే భయంగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను.
Comments
Please login to add a commentAdd a comment