మసాలా మహాశయ్‌ ఇక లేరు.. | MDH owner Mahashay Dharampal Gulati passes away | Sakshi
Sakshi News home page

మసాలా మహాశయ్‌ ఇక లేరు..

Published Fri, Dec 4 2020 2:08 AM | Last Updated on Fri, Dec 4 2020 4:25 AM

MDH owner Mahashay Dharampal Gulati passes away - Sakshi

న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్‌ అధినేత, స్పైస్‌ కింగ్‌గా పేరొందిన మహాశయ్‌ ధరమ్‌పాల్‌ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్‌ దేవీ హాస్పిటల్‌లో కోవిడ్‌ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్‌ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి.

‘మహాశయన్‌ ది హట్టి (ఎండీహెచ్‌) అధినేత శ్రీ ధరమ్‌పాల్‌ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ .. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.   

శరణార్థిగా వచ్చి.. స్పైస్‌ కింగ్‌గా ఎదిగి..
పాకిస్తాన్‌ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్‌కోట్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్‌ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్‌కోట్‌లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్‌ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది.

అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్‌ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్‌ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్‌ పోర్టల్‌లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్‌లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్‌ రోడ్, కరోల్‌ బాగ్‌ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు.

1948లో కొత్త మలుపు..
గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్‌లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్‌ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. 

ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్‌ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్‌ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్‌ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్‌ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్‌ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్‌ చున్నీలాల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఆయన విరాళంగా ఇచ్చేవారు.  250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement