Mahashay Dharampal
-
మసాలా మహాశయ్ ఇక లేరు..
న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, స్పైస్ కింగ్‌గా పేరొందిన మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్ దేవీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. ‘మహాశయన్ ది హట్టి (ఎండీహెచ్) అధినేత శ్రీ ధరమ్‌పాల్ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. శరణార్థిగా వచ్చి.. స్పైస్ కింగ్‌గా ఎదిగి.. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్కోట్లో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్కోట్లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది. అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్ పోర్టల్‌లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్‌లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు. 1948లో కొత్త మలుపు.. గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్‌లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఆయన విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
న్యూఢిల్లీ: భారత ప్రఖ్యాత మసాలా(స్పైసెస్) బ్రాండ్ మహాషియాన్ ది హట్టి(ఎండీహెచ్) అధినేత మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి(98) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ధరమ్‌పాల్ జీ వ్యక్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సమాజ సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ఇక మనీష్ సిసోడియా.. ‘‘దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్త, ఎండీహెచ్ యజమాని ధరమ్‌పాల్ మహాశయ్ నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన లాంటి మంచి మనసున్న మనిషిని నేనెప్పుడూ చూడలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని ట్వీట్ చేశారు.(చదవండి: కరోనా: మాజీ ఎంపీ పృథ్వీరాజ్ మృతి) చిన్న కొట్టుతో ప్రారంభమైన ప్రస్థానం మహాశయ్ ధరమ్‌పాల్ 1923లో సియల్కోట్(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో జన్మించారు. ఐదో తరగతిలోనే చదువు మానేశారు. తండ్రి చున్నీలాల్ గులాటి మసాలా దినుసుల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవారు. దేశ విభజన తర్వాత భారత్‌కు చేరుకున్న మహాశయ్, తమ కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించుకున్నారు. తొలుత చిన్న కొట్టు పెట్టిన మహాశయ్, 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు ఆర్జించారు. ‘కింగ్ ఆఫ్ స్పైసెస్’గా ఖ్యాతి గడించారు.(చదవండి: అమెరికాలో తెలంగాణవాసి మృతి) కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించి సామాజిక సేవలో కూడా భాగమవుయ్యారు. ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక 94 ఏళ్ల వయసులో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో అత్యంత ఎక్కువ వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎండీహెచ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇండియాలో రెండో బెస్ట్ సెల్లింగ్ స్పైసెస్ బ్రాండ్‌గా కూడా ఎండీహెచ్ గుర్తింపు పొందింది. India's most inspiring entrepreneur, MDH owner Dharm Pal Mahashay passed away this morning. I have never met such an inspiring and lively soul. May his soul rest in peace. pic.twitter.com/SOdiqFyJvX — Manish Sisodia (@msisodia) December 3, 2020 -
ఆయన చనిపోలేదు.. అవన్నీ రూమర్లు!
సోషల్ మీడియా పుణ్యమాని ఏ వార్త నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రముఖులు, సెలబ్రిటీల గురించి నకిలీ వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నా మధ్య బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే మరణించారంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా పాపులర్ స్పైసెస్ బ్రాండ్ మహాషియాన్ దీ హట్టి(ఎండీహెచ్) అధినేత మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి(99) కన్నుమూశాంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అవన్నీ పుకార్లేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్ స్పష్టం చేశారు. మహాశయ్ జీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ కంపెనీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమని నడిపిస్తున్నారని తెలిపారు. ఈ వార్తలు విన్న తర్వాత తన వయస్సు ఇంకాస్త తగ్గినట్లుగా భావిస్తున్నానంటూ మహాశయ్ తనతో చెప్పారన్నారు. అటువంటి వ్యక్తి గురించి దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. కాగా 1919లో సియల్కోట్(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో జన్మించిన మహాశయ్ మసాలా దినుసుల వ్యాపారంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 94 ఏళ్ల వయసులో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో అత్యంత ఎక్కువ వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు. చిన్న కొట్టుతో ప్రారంభించిన మహాశయ్ 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు ఆర్జించారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించి సామాజిక సేవలో కూడా భాగమవుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎండీహెచ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇండియాలో రెండో బెస్ట్ సెల్లింగ్ స్పైసెస్ బ్రాండ్‌గా కూడా ఎండీహెచ్ గుర్తింపు పొందింది.