సోషల్ మీడియా పుణ్యమాని ఏ వార్త నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రముఖులు, సెలబ్రిటీల గురించి నకిలీ వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నా మధ్య బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే మరణించారంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా పాపులర్ స్పైసెస్ బ్రాండ్ మహాషియాన్ దీ హట్టి(ఎండీహెచ్) అధినేత మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి(99) కన్నుమూశాంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అవన్నీ పుకార్లేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్ స్పష్టం చేశారు. మహాశయ్ జీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ కంపెనీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమని నడిపిస్తున్నారని తెలిపారు. ఈ వార్తలు విన్న తర్వాత తన వయస్సు ఇంకాస్త తగ్గినట్లుగా భావిస్తున్నానంటూ మహాశయ్ తనతో చెప్పారన్నారు. అటువంటి వ్యక్తి గురించి దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు.
కాగా 1919లో సియల్‌కోట్(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో జన్మించిన మహాశయ్ మసాలా దినుసుల వ్యాపారంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 94 ఏళ్ల వయసులో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో అత్యంత ఎక్కువ వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు. చిన్న కొట్టుతో ప్రారంభించిన మహాశయ్ 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు ఆర్జించారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించి సామాజిక సేవలో కూడా భాగమవుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎండీహెచ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇండియాలో రెండో బెస్ట్ సెల్లింగ్ స్పైసెస్ బ్రాండ్‌గా కూడా ఎండీహెచ్ గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment