ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.
సీజ్‌చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.
ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు ఇటీవల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment