
జైపూర్/అమరావతి: మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ దాదీ జానకి (104) శుక్రవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆమె, దీర్ఘకాలిక వ్యాధిబాధల కారణంగా మృతిచెందినట్లు ఆ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు. 21వ ఏటనే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాను ఎంచుకున్న విభాగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 140 దేశాల్లో ఆమె స్థాపించిన సేవా కేంద్రాలు ఉన్నాయి. దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆమె మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం..
బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారత కోసం జానకి విశేష కృషి అందించారని కొనియాడారు. ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ గవర్నర్ల సంతాపం..
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా ఆమె తన జీవితాన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవకు అంకితం చేశారని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment