ఉగ్ర సయీద్‌కు ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో అతని పేరును శనివారం చేర్చింది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని తెలిపింది.
అంతేకాకుండా సదరు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో అడిగిన ప్రతీసారి కచ్చితంగా హాజరుకావలసి ఉంటుందని వివరించింది. పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఉగ్రవాద నిరోధక శాఖ (సీటీడీ) హఫీజ్ పేరును ఏటీఏ జాబితాలో చేర్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశం ఉందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్ సయీద్ సహా పలువురిని గతనెల 30న లాహోర్‌లో గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశం విడిచి పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో కూడా హఫీజ్‌ను చేర్చింది.