లష్కరే ఉగ్రవాది హమ్జా
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్‌పై దాడులకు నిరంతరం పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. హఫీజ్‌ని అప్పగించాలంటూ భారత్ ఒకవైపు అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే అతను యదేచ్ఛగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హఫీజ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా కలసికట్టుగా భారత్‌పై దాడులు జరపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ ఉగ్రసంస్థలు బహిరంగంగానే ఆసక్తి ఉన్న వారు శిక్షణలో చేరవచ్చు అంటూ యువకులకి వల విసురుతున్నాయి. ఈ విషయాన్ని గత మార్చి 20న కుప్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జబియుల్లా అలియాస్ హమ్జా వెల్లడించాడు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అతను కఠోరమైన వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచాడు. ఇంటరాగేషన్‌లో హమ్జా చెప్పిన విషయాలను క్రోడీకరించి ఎన్‌ఐఏ ఒక నివేదిక రూపొందించింది. ‘జమాత్ ఉద్ దవా బహిరంగంగానే జిహాదీల కోసం ఆహ్వానిస్తోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వారికి కఠోర శిక్షణ ఇస్తోంది. అలా శిక్షణ తీసుకుంటున్న వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు బయటపెడుతున్నారు. సయీద్ హఫీజ్, లష్కరేకి చెందిన జకీర్ ఉర్ రెహ్మన్ లఖ్వీలు బహిరంగంగానే యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటూ’ హమ్జా వెల్లడించాడు.
అంతేకాదు వీరికి ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు దశల్లో శిక్షణ ఇస్తారు. మొత్తం రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల సమయంలో సయీద్ హఫీజ్ తనని తాను అమీర్ సాహెబ్ లేదంటే అమీర్–మస్గర్‌గా వ్యవహరిస్తాడు. ఉగ్రవాదంలో శిక్షణనిచ్చే ఇన్‌స్ట్రక్టర్లు, శిక్షణ కోసం చేరిన వారు కూడా అతనిని అమీర్ సాహెబ్ అనే పిలవాలి. ఇక శిక్షణనిచ్చే వారిని మసూల్స్, కాక్రూన్స్ అని పిలుస్తారు. ఈ శిక్షకులు జోన్, జిల్లా, తెహ్సీల్, పట్టణ , సెక్టార్‌స్థాయిలో ఉంటారు. వివిధ మదరసాల నుంచి పనికొచ్చేవారికి మసూల్స్ ఎంపిక చేసి లాహోర్‌లోని శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నారని ఇంటరాగేషన్‌లో హమ్జా తెలిపాడు.
ఎక్కడెక్కడ ఎలా ఈ శిక్షణ ఇస్తున్నారంటే..
1. దౌరాబైత్ ఉల్ రిజ్వాన్, పంజాబ్
యుద్ధ శిక్షణ
2. తబూక్ క్యాంప్ గడి, హబిబుల్లా ఫారెస్ట్
సాయుధ శిక్షణ
3. ఆక్సా మసర్ కేంప్ షువై నాలా.. ముజఫరాబాద్
మ్యాప్ రీడింగ్, జీపీఎస్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ
4. కరాచీ ఫుడ్ సెంటర్, ముజఫరాబాద్
సరకుల్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం, నిల్వ, వినియోగంలో శిక్షణ
5. డైకెన్, ముజఫరాబాద్
గోడలు ఎక్కడంలో శిక్షణ
6. మస్కర్ ఖైబర్ అండర్ గ్రౌండ్ సెంటర్, ముజఫరాబాద్
ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ
7. ఖలీద్ బిన్ వాలిద్, జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం, ముజఫరాబాద్
ఆయుధాలు, దుస్తులు పంపిణీలో శిక్షణ
శిక్షణా శిబిరాలకు సయీద్, లఖ్వీ హాజరయ్యేవారు : హమ్జా
హమ్జా తండ్రి స్వయంగా మసూల్. అతనే తనకి ఉగ్రవాదం శిక్షణ ఇచ్చాడని హజ్జా వెల్లడించాడు. ఈ శిక్షణ శిబిరాల్లో తమకు ఎలాంటి అవసరం వచ్చినా పాక్ ఆర్మీ, ఐఎస్‌ఎస్ సిబ్బంది సాయం చేసేవారని చెప్పాడు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన సమయంలో సయీద్, లఖ్వీలుకూడా వచ్చేవారని చెప్పాడు. సయీద్ అందరినీ హత్తుకొని భారత్‌పై దాడులకు దిగండంటూ ప్రేరేపించాడని హజ్జా చెప్పుకొచ్చాడు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment