LeT terrorists
-
ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయింది. ఈ కేసుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా గత నెల 25న తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు ఎన్ఐఏ డీఎస్పీ రాజీవ్ కుమార్ సింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ఈ ఎఫ్ఐఆర్ను ఆదివారం అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టు అయిన ఈ ఉగ్ర త్రయంపై తొలుత సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను సిట్ అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన బృందాలు వివిధ కోణాల్లో విచారించాయి. ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ కోణాలు అనేకం ఉన్నాయని నగర పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్‌కు సంబంధించిన కీలక వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉంది. వీరి నుంచి ఈ త్రయానికి విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆదేశాలు అందాయి. చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు అక్కడ నుంచే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) మీదుగా కాశ్మీర్‌కు డ్రోన్ల ద్వారా డెడ్ డ్రాప్ విధానంలో చేరాయి. వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చారు. ఈ స్లీపర్ సెల్స్ ఎవరనే దాంతో పాటు ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని భావించిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్నీ ఆరా తీయాల్సి న అవసరం ఉందని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. వీటితో పాటు ఉగ్రవాదుల సంప్రదింపుల మార్గాలు, నగదు లావాదేవీలు గుర్తించడంతో సహా కీలక వివరాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. వీటితో పాటు ఈ కేసులో పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద ఆరోపణలు చేర్చా రు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కస్టడీకి తీసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. (చదవండి: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?) -
కరడుగట్టిన ఉగ్రవాదిగా ఏడు దశల్లో శిక్షణ
ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్‌పై దాడులకు నిరంతరం పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. హఫీజ్‌ని అప్పగించాలంటూ భారత్ ఒకవైపు అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే అతను యదేచ్ఛగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. హఫీజ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా కలసికట్టుగా భారత్‌పై దాడులు జరపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందు కోసం ఆ ఉగ్రసంస్థలు బహిరంగంగానే ఆసక్తి ఉన్న వారు శిక్షణలో చేరవచ్చు అంటూ యువకులకి వల విసురుతున్నాయి. ఈ విషయాన్ని గత మార్చి 20న కుప్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జబియుల్లా అలియాస్ హమ్జా వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అతను కఠోరమైన వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచాడు. ఇంటరాగేషన్‌లో హమ్జా చెప్పిన విషయాలను క్రోడీకరించి ఎన్ఐఏ ఒక నివేదిక రూపొందించింది. ‘జమాత్ ఉద్ దవా బహిరంగంగానే జిహాదీల కోసం ఆహ్వానిస్తోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వారికి కఠోర శిక్షణ ఇస్తోంది. అలా శిక్షణ తీసుకుంటున్న వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు బయటపెడుతున్నారు. సయీద్ హఫీజ్, లష్కరేకి చెందిన జకీర్ ఉర్ రెహ్మన్ లఖ్వీలు బహిరంగంగానే యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారంటూ’ హమ్జా వెల్లడించాడు. అంతేకాదు వీరికి ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు దశల్లో శిక్షణ ఇస్తారు. మొత్తం రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమాల సమయంలో సయీద్ హఫీజ్ తనని తాను అమీర్ సాహెబ్ లేదంటే అమీర్–మస్గర్‌గా వ్యవహరిస్తాడు. ఉగ్రవాదంలో శిక్షణనిచ్చే ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ కోసం చేరిన వారు కూడా అతనిని అమీర్ సాహెబ్ అనే పిలవాలి. ఇక శిక్షణనిచ్చే వారిని మసూల్స్, కాక్రూన్స్ అని పిలుస్తారు. ఈ శిక్షకులు జోన్, జిల్లా, తెహ్సీల్, పట్టణ , సెక్టార్స్థాయిలో ఉంటారు. వివిధ మదరసాల నుంచి పనికొచ్చేవారికి మసూల్స్ ఎంపిక చేసి లాహోర్‌లోని శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నారని ఇంటరాగేషన్‌లో హమ్జా తెలిపాడు. ఎక్కడెక్కడ ఎలా ఈ శిక్షణ ఇస్తున్నారంటే.. 1. దౌరాబైత్ ఉల్ రిజ్వాన్, పంజాబ్ యుద్ధ శిక్షణ 2. తబూక్ క్యాంప్ గడి, హబిబుల్లా ఫారెస్ట్ సాయుధ శిక్షణ 3. ఆక్సా మసర్ కేంప్ షువై నాలా.. ముజఫరాబాద్ మ్యాప్ రీడింగ్, జీపీఎస్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ 4. కరాచీ ఫుడ్ సెంటర్, ముజఫరాబాద్ సరకుల్ని క్రమం తప్పకుండా సరఫరా చేయడం, నిల్వ, వినియోగంలో శిక్షణ 5. డైకెన్, ముజఫరాబాద్ గోడలు ఎక్కడంలో శిక్షణ 6. మస్కర్ ఖైబర్ అండర్ గ్రౌండ్ సెంటర్, ముజఫరాబాద్ ఆత్మాహుతి దాడుల్లో శిక్షణ 7. ఖలీద్ బిన్ వాలిద్, జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం, ముజఫరాబాద్ ఆయుధాలు, దుస్తులు పంపిణీలో శిక్షణ శిక్షణా శిబిరాలకు సయీద్, లఖ్వీ హాజరయ్యేవారు : హమ్జా హమ్జా తండ్రి స్వయంగా మసూల్. అతనే తనకి ఉగ్రవాదం శిక్షణ ఇచ్చాడని హజ్జా వెల్లడించాడు. ఈ శిక్షణ శిబిరాల్లో తమకు ఎలాంటి అవసరం వచ్చినా పాక్ ఆర్మీ, ఐఎస్ఎస్ సిబ్బంది సాయం చేసేవారని చెప్పాడు. శిక్షణ కార్యక్రమం పూర్తయిన సమయంలో సయీద్, లఖ్వీలుకూడా వచ్చేవారని చెప్పాడు. సయీద్ అందరినీ హత్తుకొని భారత్‌పై దాడులకు దిగండంటూ ప్రేరేపించాడని హజ్జా చెప్పుకొచ్చాడు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద 2002లో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏళ్లుగా ఒమన్‌లో మకాం వేసిన ఇతను ఇటీవల ఖతర్ వెళ్లే ప్రయత్నాల్లో ఇంటర్‌పోల్‌కు దొరికాడు. దీంతో షఫీఖ్‌ను బలవంతంగా భారత్‌కు పంపారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఉగ్రవాదిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లష్కరే తొయిబాలో (ఎల్ఈటీ) షఫీఖ్ కీలక పాత్ర పోషించాడు. ఆలయం వద్ద పేలుళ్లలో ఉగ్రవాదులైన అబ్దుల్ బారి అలియాస్ అబు హంజా, ఫర్హాతుల్లా ఘోరీ, అబ్దుల్ రజాఖ్, సలావుద్దీన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్రను అమలు చేయ డం కోసం దుబాయ్ కేంద్రంగా అనేక సమావేశా లు జరగడంతో పాటు భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేశారు. ఈ రెండు వ్యవహా రాల్లోనూ ముంబైకి చెందిన, దుబాయ్‌లో ఉంటూ ఎల్ఈటీ కోసం పని చేస్తున్న షఫీఖ్ కీలకంగా వ్యవహరించాడు. 2002, నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులున్నారు. ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న షఫీఖ్పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతున్న షఫీఖ్ ఇటీవల ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్‌పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఖతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం కోసం సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆజం, సయ్యద్ అబ్దుల్ అజీజ్‌లు గతంలో ఉప్పల్, కరీంనగర్ల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మిగిలిన వారిలో 8 మందిపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్‌ను 2005లో అరెస్టు చేశారు. సలావుద్దీన్‌ను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 2012లో పట్టుకోగా, ట్రాన్సిట్ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. రజాఖ్ 2011లో ఆత్మహత్య చేసుకోగా... సలావుద్దీన్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
అమర్నాథ్ ఉగ్రదాడి నిందితుడి ఎన్కౌంటర్
-
అమర్నాథ్ ఉగ్రదాడి నిందితుడి ఎన్కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీః లష్కరే తోయిబాకు చెందిన టాప్ మిలిటెంట్, అమర్నాథ్ దాడిలో కీలక పాత్ర పోషించిన అబూ ఇస్మాయిల్ శ్రీనగర్ జిల్లా నౌగం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. లష్కరే టెర్రరిస్టు అబూ ఇస్మాయిల్, అతడి సహచరుడు నౌగం ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతులయ్యారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.ఇది పోలీసులు, భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయమని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఇద్దరు హిజ్భుల్ సానుభూతిపరుల అరెస్ట్ జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు హిజ్భుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరులను గురువారం అరెస్ట్ చేశారు. హండ్వారా ప్రాంతంలో వాహీద్ అహ్మద్ భట్, ముహ్మద్ షఫీ మీర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి రెండు గ్రెనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులను అవసరమైన వస్తువులను అందజేయటం, భద్రతా దళాల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాచారాన్ని చేరవేయడం వీరు చేస్తున్నారని అధికారులు తెలిపారు. -
సంచలన తీర్పు: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరి
కోల్‌కతా: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పశ్చిమ బెంగాల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శనివారం సంచలన తీర్పు చెప్పింది. శిక్షపడిన ముగ్గురిలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులుకాగా, ఒకరు భారతీయుడు. 2007లో బంగ్లాదేశ్ సరిహద్దుగుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను(మొహమ్మద్ యూనస్, అబ్దుల్లా, ముజఫర్ అహ్మద్ రాథోడ్, షేక్ అబ్దుల్లా నయీం) బీఎస్ఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. అనంతరం బెంగాల్ సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. నిందితులపై ఐపీసీ 120బి, 121, 122 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దోషులేనని నిర్ధారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ శనివారం తీర్పు చెప్పిది. నాలుగో దోషి(షేక్ అబ్దుల్లా నయీం) పరారీలో ఉన్నాడు. ఇదీ నేపథ్యం.. పాకిస్థాన్‌లోని హరీపూర్‌కు చెందిన టీచర్ అబ్దుల్లా, కరాచీకి చెందిన యూనస్, జమ్ముకశ్మీర్(అనంతనాగ్)కు చెందిన ముజఫర్ అహ్మద్, మహారాష్ట్రకు చెందిన షేక్ అబ్దుల్లా నయీమ్‌లు లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరి భీరక ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక జట్టుగా ఏర్పడన ఈ నలుగురూ.. కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై దాడి చేసేందుకు పథకం రచించి 2007లో బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతూ పట్టుపడ్డారు. బీఎస్ఎఫ్ అధికారులు.. వీరి నుంచి ఏకే-47 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీఐడీకి అప్పగించారు. విచారణ సందర్భంగా షేక్ అబ్దుల్లా నయీంను మహారాష్ట్రకు తరలించగా అతను పోలీసుల కళ్లుకప్పి తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నిందితులపై కేసు నిరూపణకావడంతో శనివారం తీర్పు వెలువడింది.