నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం వద్ద 2002లో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏళ్లుగా ఒమన్‌లో మకాం వేసిన ఇతను ఇటీవల ఖతర్ వెళ్లే ప్రయత్నాల్లో ఇంటర్‌పోల్‌కు దొరికాడు. దీంతో షఫీఖ్‌ను బలవంతంగా భారత్‌కు పంపారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఉగ్రవాదిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
లష్కరే తొయిబాలో (ఎల్‌ఈటీ) షఫీఖ్ కీలక పాత్ర పోషించాడు. ఆలయం వద్ద పేలుళ్లలో ఉగ్రవాదులైన అబ్దుల్ బారి అలియాస్ అబు హంజా, ఫర్హాతుల్లా ఘోరీ, అబ్దుల్ రజాఖ్, సలావుద్దీన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్రను అమలు చేయ డం కోసం దుబాయ్ కేంద్రంగా అనేక సమావేశా లు జరగడంతో పాటు భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేశారు. ఈ రెండు వ్యవహా రాల్లోనూ ముంబైకి చెందిన, దుబాయ్‌లో ఉంటూ ఎల్‌ఈటీ కోసం పని చేస్తున్న షఫీఖ్ కీలకంగా వ్యవహరించాడు. 2002, నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులున్నారు. ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న షఫీఖ్‌పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతున్న షఫీఖ్ ఇటీవల ఖతర్ పయనమయ్యాడు.
ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్‌పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఖతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం కోసం సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆజం, సయ్యద్ అబ్దుల్ అజీజ్‌లు గతంలో ఉప్పల్, కరీంనగర్‌ల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మిగిలిన వారిలో 8 మందిపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్‌ను 2005లో అరెస్టు చేశారు. సలావుద్దీన్‌ను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 2012లో పట్టుకోగా, ట్రాన్సిట్ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. రజాఖ్ 2011లో ఆత్మహత్య చేసుకోగా... సలావుద్దీన్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment