Hyderabad blast case
-
పాకిస్తాన్లో ‘టెర్రర్ బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్‌గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్‌లోనే ఉంటూ భారత్‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు. 9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్‌కతాలో ఆసిఫ్రజా కమాండో ఫోర్స్(ఏఆర్డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది. రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్‌గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్‌లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది. -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద 2002లో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏళ్లుగా ఒమన్‌లో మకాం వేసిన ఇతను ఇటీవల ఖతర్ వెళ్లే ప్రయత్నాల్లో ఇంటర్‌పోల్‌కు దొరికాడు. దీంతో షఫీఖ్‌ను బలవంతంగా భారత్‌కు పంపారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఉగ్రవాదిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లష్కరే తొయిబాలో (ఎల్ఈటీ) షఫీఖ్ కీలక పాత్ర పోషించాడు. ఆలయం వద్ద పేలుళ్లలో ఉగ్రవాదులైన అబ్దుల్ బారి అలియాస్ అబు హంజా, ఫర్హాతుల్లా ఘోరీ, అబ్దుల్ రజాఖ్, సలావుద్దీన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్రను అమలు చేయ డం కోసం దుబాయ్ కేంద్రంగా అనేక సమావేశా లు జరగడంతో పాటు భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేశారు. ఈ రెండు వ్యవహా రాల్లోనూ ముంబైకి చెందిన, దుబాయ్‌లో ఉంటూ ఎల్ఈటీ కోసం పని చేస్తున్న షఫీఖ్ కీలకంగా వ్యవహరించాడు. 2002, నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులున్నారు. ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న షఫీఖ్పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతున్న షఫీఖ్ ఇటీవల ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్‌పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఖతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం కోసం సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆజం, సయ్యద్ అబ్దుల్ అజీజ్‌లు గతంలో ఉప్పల్, కరీంనగర్ల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మిగిలిన వారిలో 8 మందిపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్‌ను 2005లో అరెస్టు చేశారు. సలావుద్దీన్‌ను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 2012లో పట్టుకోగా, ట్రాన్సిట్ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. రజాఖ్ 2011లో ఆత్మహత్య చేసుకోగా... సలావుద్దీన్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
తీహార్ జైలుకు ‘దిల్సుఖ్నగర్’ నిందితులు
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న జియా ఉల్ రెహమాన్(పాకిస్థాన్), తహసీన్ అఖ్తర్ అనే ఉగ్రవాదులను మంగళవారం ఎన్ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ను కొద్ది రోజుల కిందట తీహార్ జైలుకు తరలించగా.. మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్‌ను ముంబై జైలుకు పంపిన విషయం తెలిసిందే. -
యాసిన్ భత్కల్ తీహార్ జైలుకు తరలింపు
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్‌ను ముంబైకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భత్కల్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. భత్కల్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అధికారులు అతన్ని తీహార్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. -
నాందేడ్‌లో ఆయుధాలు కొని..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని, తుపాకులతో బీభత్సం సృష్టించాలని కుట్ర పన్నిన ఏయూటీ ఉగ్రవాదులు.. అందుకోసం కావల్సిన సామగ్రి కోసం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఆయుధాలు కొనేందుకు వెళ్లి, అక్కడ రూ. 65 వేలు చెల్లించినా, వాళ్లకు ఆయుధాలు మాత్రం లభ్యం కాలేదు. ఉగ్రదాడులు చేయడానికి ఒప్పుకొన్నందుకు వీళ్లు ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున ముట్టందని కూడా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అజ్మీర్‌లో ఆయుధాలు దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి అక్కడ రెండు సెమీ ఆటోమేటిక్ 9ఎంఎం పిస్టళ్లు కొన్నారు. ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను హైదరాబాద్, అనంతపురం నగరాల్లో కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా లేనిచోట ఐఈడీ పరీక్షలు, ఇతర ప్రాక్టీసు చేసినట్లు కూడా చెబుతున్నారు. బాంబులు ఎలా తయారుచేయాలన్న విషయాన్ని ఇబ్రహీం తమకు యూట్యూబ్ వీడియోల ద్వారా చూపించినట్లు ఎన్ఐఏ విచారణలో హబీబ్ వెల్లడించాడు. ప్రభుత్వంపై భారీ యుద్ధానికి తెగబడాలన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పులకు వాళ్లు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర నిఘావర్గాల సమాచారం సరైన సమయంలో అందడం, వెంటనే ఎన్ఐఏ కూడా స్పందించడంతో హైదరాబాద్ నగరానికి భారీ ఉగ్రవాద ముప్పు తప్పినట్లయింది. -
‘ఉగ్ర’ అనుమానితుల్లో ఆరుగురి విడుదల
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు విడిచిపెట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో 11 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని ఎన్ఐఏ కార్యాలయంలోనే విచారించారు. అనంతరం ఆరుగురిని విడిచిపెట్టారు. సయ్యద్ నైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్ నైమతుల్లా (42), ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ అలియాస్ రిజ్వాన్ (29), మహ్మద్ అతుల్లా రహమాన్ (30), అబ్దుల్ అలియాస్ అల్ జిలానీ అబ్దుర్ ఖాదర్ మొహిసిన్ మహమూద్ (32), ఏఎం అజహర్ (20), మహ్మద్ అర్బాజ్ అహ్మద్ (21) లను విడుదల చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికార వర్గాలు తెలిపాయి. -
పేలుళ్ల నిందితుడికి బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: హైదరాబాద్ వరుస పేలుళ్ల కేసు నిందితుడికి హైకోర్టులో చుక్కెదురైంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల సంఘటనల్లో నిందితుడు ఫరూక్ షర్పొద్దీన్ తర్కాష్ల అలియాస్ అబ్దుల్లాకు బెయిల్ ఇవ్వడానికి గురువారం హైకోర్టు నిరాకరించింది. 2007 ఆగస్టు 25న ... లుంబినీపార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో ఏకకాలంలో పేలుళ్లు సంబవించిన విషయం తెలిసిందే. ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అక్కడికక్కడే 17 మంది చనిపోగా 80 వరకు గాయపడ్డారు. -
హైదరాబాద్ పేలుళ్లలో థామస్ పాత్ర?
పేలుడు పదార్థం సరఫరా చేసినట్లు అనుమానం హర్యానాలో పట్టుకున్న మంగుళూరు పోలీసులు వివరాలు ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలోని కర్కలా పోలీసులు హర్యానాలో అరెస్టు చేసిన బిజ్జూ థామస్‌కు నగరంలో జరిగిన రెండు జంట పేలుళ్లలో పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ రెండింటికీ అవసరమైన పేలుడు పదార్థం అతడే సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు థామస్ పేరు నేరుగా ఏ కేసులోనూ ప్రస్తావించకపోయినా... కొన్ని ఆధారాలను బట్టి ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు అధికారులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ వివరాలు ఆరా తీస్తున్నారు. థామస్ ఫ్రమ్ కేరళ... కేరళకు చెందిన బిజ్జు థామస్ కొన్నేళ్ల క్రితమే కర్ణాటకకు వలస వచ్చి కర్కలా ప్రాంతంలో స్థిరపడ్డాడు. తమిళనాడు నుంచి వలసవచ్చిన వీరమణితో కలిసి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ వంటి పేలుడు పదార్థాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. వీరి లైసెన్స్ నిబంధనల ప్రకారం కేవలం 500 కేజీల పేలుడు పదార్థాన్ని మాత్రమే నిల్వ చేసుకుని విక్రయించాల్సి ఉంది. అయితే మార్చి ఆఖరి వారంలో నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న కర్కలా పోలీసులు అక్కడి కోటి చిన్నయ్య థీమ్ పార్క్ సమీపంతో పాటు శివారు గ్రామాలైన నర్కే, దుర్గాల్లో ఉన్న వీరి గోదాములపై దాడులు చేశారు. అక్కడ ఏకంగా 62 టన్నుల పేలుడు పదార్థం, 50,350 డిటోనేటర్లు, 19,250 ఫ్యూజ్ వైర్లు స్వాధీనం కావడంతో కేసు నమోదు చేసి బిజ్జు, వీరమణి కోసం వేట ప్రారంభించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న థామస్‌ను హర్యానాలోని గుర్గావ్లో పట్టుకుని బుధవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. వీరమణి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అక్రమ విక్రయాల్లో దిట్టలు... కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న అనేక క్వారీలు, విద్యుత్ ప్రాజెక్టులకు అక్రమంగా పేలుడు పదార్థాలకు విక్రయిస్తున్నారని ఈ ద్వయంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో థామస్, వీరమణిలపై పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వల ఆరోపణల పైనే కేసులు నమోదు చేసిన కర్కలా పోలీసులు ఉగ్రవాదం కోణంతో పాటు మావోయిస్టులకు సహకారం తదితర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 2007 ఆగస్టు 25న జరిగిన లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ పేలుళ్లతో పాటు గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసుల్లోనూ థామస్ పాత్రను దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తల దాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ గతంలో మంగుళూరులో సివిల్ ఇంజనీర్‌గా నిర్మాణ రంగంలో పని చేయడంతో వీరితో పరిచయాలు ఏర్పడి ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రెండుసార్లూ మంగుళూరు నుంచే... నగరంలో ఐఎం ఉగ్రవాదులు సృష్టించిన రెండు విధ్వంసాలకూ అవసరమైన పేలుడు పదార్థాలు మంగుళూరు నుంచే సిటీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజ్జు, వీరమణి వీటిని అందించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2007లో పేలుళ్లకు కొన్ని రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులో సాక్షాత్తు ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కలే మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలతో కూడిన బాంబుల్ని పంపాడు. 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌కు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో అమ్మోనియం నైట్రేట్ అందించాడు. ఈ అంశాలను బేరీజు వేస్తున్న నిఘా వర్గాలు బిజ్జు, వీరమణి పాత్రల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వఖాస్ (వీరిద్దరూ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నిందితులు) ఇచ్చిన సమాచారం మేరకు బిజ్జు స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బిజ్జు విచారణ కోసం రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులూ కర్ణాటక చేరుకున్నారు. ఇతడి పాత్ర నిర్థారణైతే రెండు జంట పేలుళ్ల కేసుల్లో ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకురావాలని నిర్ణయించారు. -
యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ కు రప్పిస్తాం: అనురాగ్ శర్మ
భారత, నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ లను విచారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బీహార్ కు వెళ్లనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమీషన్ అనురాగ్ శర్మ మీడియాకు వెళ్లడించారు. ఫిబ్రవరి 21 తేదిన దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరస పేలుళ్ల ఘటనలో భత్కల్, అసదుల్లాలను విచారిస్తారని శర్మ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధమున్న సీసీటీవీ దృశ్యాలతో భత్కల్, అసదుల్లాల చిత్రాలు సరిపోయాయని పోలీసులు తెలిపారు. విచారణలో పేలుళ్ల సంఘటనతో సంబంధమున్నట్టు తేలితే, తదుపరి విచారణకు భత్కల్, అసదుల్లాలను హైదరాబాద్ కు తీసుకువస్తామన్నారు. ఫిబ్రవరి 21 తేదిన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 17 మంది మృత్యువాత పడగా, 100 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపగా, ఆతర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.