నాందేడ్లో ఆయుధాలు కొని..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని, తుపాకులతో బీభత్సం సృష్టించాలని కుట్ర పన్నిన ఏయూటీ ఉగ్రవాదులు.. అందుకోసం కావల్సిన సామగ్రి కోసం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని అజ్మీర్లో ఆయుధాలు కొనేందుకు వెళ్లి, అక్కడ రూ. 65 వేలు చెల్లించినా, వాళ్లకు ఆయుధాలు మాత్రం లభ్యం కాలేదు. ఉగ్రదాడులు చేయడానికి ఒప్పుకొన్నందుకు వీళ్లు ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున ముట్టందని కూడా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అజ్మీర్లో ఆయుధాలు దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి అక్కడ రెండు సెమీ ఆటోమేటిక్ 9ఎంఎం పిస్టళ్లు కొన్నారు. ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్లను హైదరాబాద్, అనంతపురం నగరాల్లో కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా లేనిచోట ఐఈడీ పరీక్షలు, ఇతర ప్రాక్టీసు చేసినట్లు కూడా చెబుతున్నారు. బాంబులు ఎలా తయారుచేయాలన్న విషయాన్ని ఇబ్రహీం తమకు యూట్యూబ్ వీడియోల ద్వారా చూపించినట్లు ఎన్ఐఏ విచారణలో హబీబ్ వెల్లడించాడు. ప్రభుత్వంపై భారీ యుద్ధానికి తెగబడాలన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పులకు వాళ్లు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర నిఘావర్గాల సమాచారం సరైన సమయంలో అందడం, వెంటనే ఎన్ఐఏ కూడా స్పందించడంతో హైదరాబాద్ నగరానికి భారీ ఉగ్రవాద ముప్పు తప్పినట్లయింది.