హైదరాబాద్ పేలుళ్లలో థామస్ పాత్ర?
పేలుడు పదార్థం సరఫరా చేసినట్లు అనుమానం
హర్యానాలో పట్టుకున్న మంగుళూరు పోలీసులు
వివరాలు ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలోని కర్కలా పోలీసులు హర్యానాలో అరెస్టు చేసిన బిజ్జూ థామస్‌కు నగరంలో జరిగిన రెండు జంట పేలుళ్లలో పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ రెండింటికీ అవసరమైన పేలుడు పదార్థం అతడే సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు థామస్ పేరు నేరుగా ఏ కేసులోనూ ప్రస్తావించకపోయినా... కొన్ని ఆధారాలను బట్టి ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు అధికారులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ వివరాలు ఆరా తీస్తున్నారు.
థామస్ ఫ్రమ్ కేరళ...
కేరళకు చెందిన బిజ్జు థామస్ కొన్నేళ్ల క్రితమే కర్ణాటకకు వలస వచ్చి కర్కలా ప్రాంతంలో స్థిరపడ్డాడు. తమిళనాడు నుంచి వలసవచ్చిన వీరమణితో కలిసి అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ వంటి పేలుడు పదార్థాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. వీరి లైసెన్స్ నిబంధనల ప్రకారం కేవలం 500 కేజీల పేలుడు పదార్థాన్ని మాత్రమే నిల్వ చేసుకుని విక్రయించాల్సి ఉంది. అయితే మార్చి ఆఖరి వారంలో నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న కర్కలా పోలీసులు అక్కడి కోటి చిన్నయ్య థీమ్ పార్క్ సమీపంతో పాటు శివారు గ్రామాలైన నర్కే, దుర్గాల్లో ఉన్న వీరి గోదాములపై దాడులు చేశారు. అక్కడ ఏకంగా 62 టన్నుల పేలుడు పదార్థం, 50,350 డిటోనేటర్లు, 19,250 ఫ్యూజ్ వైర్లు స్వాధీనం కావడంతో కేసు నమోదు చేసి బిజ్జు, వీరమణి కోసం వేట ప్రారంభించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న థామస్‌ను హర్యానాలోని గుర్గావ్‌లో పట్టుకుని బుధవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. వీరమణి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
అక్రమ విక్రయాల్లో దిట్టలు...
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న అనేక క్వారీలు, విద్యుత్ ప్రాజెక్టులకు అక్రమంగా పేలుడు పదార్థాలకు విక్రయిస్తున్నారని ఈ ద్వయంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో థామస్, వీరమణిలపై పేలుడు పదార్థాల అక్రమ రవాణా, నిల్వల ఆరోపణల పైనే కేసులు నమోదు చేసిన కర్కలా పోలీసులు ఉగ్రవాదం కోణంతో పాటు మావోయిస్టులకు సహకారం తదితర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో 2007 ఆగస్టు 25న జరిగిన లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ పేలుళ్లతో పాటు గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాపుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసుల్లోనూ థామస్ పాత్రను దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తల దాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ గతంలో మంగుళూరులో సివిల్ ఇంజనీర్‌గా నిర్మాణ రంగంలో పని చేయడంతో వీరితో పరిచయాలు ఏర్పడి ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆ రెండుసార్లూ మంగుళూరు నుంచే...
నగరంలో ఐఎం ఉగ్రవాదులు సృష్టించిన రెండు విధ్వంసాలకూ అవసరమైన పేలుడు పదార్థాలు మంగుళూరు నుంచే సిటీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజ్జు, వీరమణి వీటిని అందించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2007లో పేలుళ్లకు కొన్ని రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులో సాక్షాత్తు ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కలే మంగుళూరు నుంచి పేలుడు పదార్థాలతో కూడిన బాంబుల్ని పంపాడు. 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌కు మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో అమ్మోనియం నైట్రేట్ అందించాడు.
ఈ అంశాలను బేరీజు వేస్తున్న నిఘా వర్గాలు బిజ్జు, వీరమణి పాత్రల్ని అనుమానిస్తున్నారు. మరోపక్క ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వఖాస్ (వీరిద్దరూ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితులు) ఇచ్చిన సమాచారం మేరకు బిజ్జు స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బిజ్జు విచారణ కోసం రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులూ కర్ణాటక చేరుకున్నారు. ఇతడి పాత్ర నిర్థారణైతే రెండు జంట పేలుళ్ల కేసుల్లో ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకురావాలని నిర్ణయించారు.