యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ కు రప్పిస్తాం: అనురాగ్ శర్మ
భారత, నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ లను విచారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బీహార్ కు వెళ్లనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమీషన్ అనురాగ్ శర్మ మీడియాకు వెళ్లడించారు. ఫిబ్రవరి 21 తేదిన దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరస పేలుళ్ల ఘటనలో భత్కల్, అసదుల్లాలను విచారిస్తారని శర్మ తెలిపారు.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధమున్న సీసీటీవీ దృశ్యాలతో భత్కల్, అసదుల్లాల చిత్రాలు సరిపోయాయని పోలీసులు తెలిపారు. విచారణలో పేలుళ్ల సంఘటనతో సంబంధమున్నట్టు తేలితే, తదుపరి విచారణకు భత్కల్, అసదుల్లాలను హైదరాబాద్ కు తీసుకువస్తామన్నారు.
ఫిబ్రవరి 21 తేదిన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 17 మంది మృత్యువాత పడగా, 100 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపగా, ఆతర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.