రియాజ్, ఇక్బాల్ , ఖురేషీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్‌గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్‌లోనే ఉంటూ భారత్‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు.
ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు.
9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్‌కతాలో ఆసిఫ్‌రజా కమాండో ఫోర్స్(ఏఆర్‌డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది.
రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్‌గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్‌లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్‌రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్‌ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment