Indian Mujahideen (IM)
-
దర్బాంగా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రకుట్ర
-
దర్భంగా పేలుడు కేసులో ఉగ్ర కుట్ర..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు. ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్లో అన్నదమ్ముల సీసీఫుటేజ్‌ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది. చదవండి: ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా -
ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది. అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు. రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది. దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు. తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్లో వివరించాడు. లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు. -
‘కొత్త’ వాళ్ల లెక్క ఇక పక్కా!
2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబు దాడికి పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు హబ్సిగూడలోని బంజారా నిలయం అపార్ట్మెంట్లో విద్యార్థుల ముసుగులో అద్దెకు దిగారు. ఈ ఘటన తర్వాత అద్దెకు ఉండే వారి వివరాలు పక్కాగా తెలుసుకోవాలని పోలీసు విభాగం సూచించినా అమలుకు నోచుకోలేదు. అనంతరం 2013లో ముష్కరులు అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడి నుంచే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడి వెళ్లిపోయారు. ఇలా నగరంతో పాటు శివార్లలో ఆశ్రయం పొందుతూ అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తరచూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఇలా... విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్, ఇతర జిల్లాలకు నిత్యం వందల మంది వలసలు వస్తున్నారు. ఇలా వచ్చిన వారు అద్దెకు ఇళ్లు తీసుకుని నివసించడంతో పాటు చిన్న చిన్న పనులు చేయడం, ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఇలా అన్ని రాష్ట్రాలకూ చెందిన వారు వచ్చి ఉంటున్నప్పటికీ వారికి సంబంధించిన వివరాలు ఎక్కడా అందుబాటులో ఉండట్లేదు. ఈ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులకు కలసి వస్తున్నాయి. ప్రత్యేక ‘ఆపరేషన్స్’పై వస్తున్న ముష్కరమూకలు షెల్టర్ ఏర్పాటు చేసుకుని మరీ తమ ‘పని’పూర్తి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ అసాంఘిక శక్తులు చిక్కిన తర్వాత జరిగే విచారణలోనే మకాంకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో అలా.. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే గోవాలో ఈ తనిఖీ పక్కాగా జరుగుతోంది. అక్క డ ఎవరైనా బయటి రాష్ట్రాల వారు వచ్చి అద్దెకు దిగితే యజమాని వారి వివరాలను సమీప పోలీసుస్టేషన్లో అందిస్తారు. ఠాణాల్లో ప్రత్యేకంగా టెనింట్స్ రిజిస్టర్ నిర్వహించే పోలీసులు ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు దిగిన వారిని పరిశీలిస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారు అందించిన గుర్తింపు కార్డు ఆధారంగా స్వస్థలాల్లో తనిఖీలు చేస్తుంటారు. ఈ విధానం అక్కడి అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించింది. ఇప్పుడేం చేస్తారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే, ఉద్యోగం చేసే వారి వివరా లు పక్కాగా నమోదు చేయించేలా పోలీసు విభాగం ఏర్పాట్లు చేయనుంది. ప్రజా భద్రతా చట్టంలో మార్పుచేర్పుల ద్వారా ప్రత్యేక పోర్టల్ అమలు చేయాలని యోచి స్తోంది. శీతాకాల లేదా వర్షాకాల శాసనసభ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టించాలని భావిస్తోంది. టెనింట్స్, ఎం ప్లాయీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్ పని చేస్తాదిలా.. ఇతర రాష్ట్రాల వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా యజమానులు/సంస్థలు వారి ఫొటోతో సహా గుర్తింపు కార్డులు, ఇతర వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. స్పెషల్ బ్రాంచ్ అధీనంలో ఏర్పడే ప్రత్యేక విభాగం వీటిని పరిశీలిస్తుంది. అనుమానం వచ్చిన వారి వివ రాలను క్రాస్ చెక్ చేస్తుంటుంది. ఈ విధానం కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టంలో కొన్ని మార్పుచేర్పులు చేయనుంది. వీటి ప్రకారం వివరాలు అప్లోడ్ చేయడంలో విఫలమైన, నిర్లక్ష్యం వహించిన యజమాని బాధ్యుడవుతాడు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం పోలీసు విభాగానికి ఉండనుంది. -
మోస్ట్ వాంటెడ్ ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: దేశరాజధానిలో 2008లో వరుస బాంబుపేలుళ్ల కేసులో కీలక సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ అలియాస్ జునైద్(32)ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరిజ్‌ఖాన్.. పదేళ్ల తర్వాత ఇండో–నేపాల్ సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పేలుళ్లు సహా 165 మంది ప్రజల మృతికి ఆరిజ్ కారకుడని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంజనీర్ అయిన ఆరిజ్.. బాంబులు తయారుచేయడం, దాడికి ప్రణాళికలు రచించడం, వాటిని అమలు పర్చడంలో సిద్ధహస్తుడని వెల్లడించారు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆరిజ్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యారన్నారు. ఐఎం, సిమీ నేతలు అరెస్ట్ కావడంతో భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నిందితుడు యత్నించాడన్నారు. నేపాల్‌లోని ఓ పాఠశాలలో ఆరిజ్ టీచర్‌గా చేసేవాడన్నారు. 2007లో యూపీ పేలుళ్లు, 2008లో జైపూర్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో కూడా ఆరిజ్ నిందితుడిగా ఉన్నాడు. ఆరిజ్ ఆచూకీ తెలిపినవారికి ఎన్ఐఏ రూ.10లక్షలు, ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డుల్ని గతంలోనే ప్రకటించారు. -
పాకిస్తాన్లో ‘టెర్రర్ బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్‌గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్‌లోనే ఉంటూ భారత్‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు. 9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్‌కతాలో ఆసిఫ్రజా కమాండో ఫోర్స్(ఏఆర్డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది. రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్‌గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్‌లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది. -
సిటీ పేలుళ్లలో ఐఎం ఉగ్రవాది హస్తం?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రసంస్థ నగరంలో 2007, 2013ల్లో పాల్పడిన జంట పేలుళ్ల కేసులో ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ పాత్రపై రాష్ట్ర నిఘా విభాగం లోతుగా ఆరా తీస్తోంది. దశాబ్దకాలంగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు అక్కడి ఘాజీపురలో శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో అతడిని విచారించేందుకు రాష్ట్రంలోని నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. సిమిలో ఉండగా సిటీకి మధ్యప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన తౌఖీర్ కంప్యూటర్ కోర్సు కోసం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఆలిండియా చీఫ్ సఫ్దర్ నఘోరీ పరిచయంతో ఓ సంస్థలో ఉన్నతోద్యోగానికి 2001లో రాజీనామా చేశాడు. సిమి వెలువరిస్తున్న ‘ఇస్లామిక్ మూవ్మెంట్’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే నఘోరీతో కలసి హైదరాబాద్ వచ్చి సిమి సానుభూతిపరుల్ని కలిశాడు. వీరికి గుజరాత్ అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను ఓ వ్యక్తి ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒక్క ‘పర్యటనే’రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ వీరు పలుమార్లు నగరానికి వచ్చినట్లు అనుమానాలున్నాయి. ఐఎం ఏర్పాటులో కీలకంగా బండ్లగూడలోని ఓ విద్యాసంస్థలో పని చేసి, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముఫ్తీ అబు బషర్‌ను తౌఖీర్ కలసినట్లు అనుమానిస్తున్నాయి. 2001 సెప్టెంబర్‌లో కేంద్రం సిమిపై నిషేధం విధించడంతో అతడితోపాటు మరికొందరు అప్పట్లో ముంబైలో ఉంటున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను కలసి ఐఎంను స్థాపించారు. బాంబుల తయారీలో నిష్ణాతుడిగా పేరున్న తౌఖీర్ పేరు అహ్మదాబాద్, ముంబై పేలుళ్లలో నేరుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి పరారీలో ఉన్న అతడు కొన్నాళ్ల పాటు పాక్, దుబాయ్‌ల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు పేలుళ్ల వెనుక ఐఎం గోకుల్‌చాట్, లుంబినీపార్క్ (2007), దిల్సుఖ్నగర్ (2013)లో జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ రెండు కేసుల్లోనూ రియాజ్ భత్కల్, ఒకదాంట్లో ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్ నిందితులుగా ఉన్నారు. వీటికి సంబంధించిన సమావేశాల్లో భత్కల్ సోదరులతో పాటు తౌఖీర్ కూడా పాల్గొని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది రూఢీ అయితే నగరంలోని జంటపేలుళ్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో ఇతడు వాంటెడ్‌గా మారతాడు. -
నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
-
నలుగురు తీవ్రవాదుల అరెస్ట్
జైపూర్: ఎన్నికల్లో బాంబు పేలుళ్లు సృష్టించాలనుకున్న తీవ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకిస్థాన్ తీవ్రవాది టెర్రరిస్ట్ ఖ్వాస్ అలియాస్ మోనూ ఉన్నట్టు తెలుస్తోంది. జైపూర్‌లో ముగ్గురు, జోథ్‌పూర్‌లో ఒకరిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా డిటోనేటర్లు, బాంబు తయారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, పాట్నా, బుద్ధగయ పేలుళ్లతో మోనూకు సంబంధం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను'
'మై నేమ్ ఈజ్ షాహీద్ ఆలీ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి షాహీద్ ఆలీ ఖాన్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెర్రిరిస్ట్ ను కాదు అంటూ వివరణ ఇచ్చారు. పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినా.. ఓట్ల కోసం బీజేపీ తన రాజీనామాకు డిమాండ్ చేయడం అత్యంత దురదృష్టకరం అని ఆయన అన్నారు. అయితే ఆలీ ఖాన్ కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాసటగా నిలవడం కొంత ఊరట లభించింది. మోతిహరి, సితామర్హి జిల్లాల ఎస్పీలు విచారణ జరిపారని, టెర్రిరిస్టులతో ఆలీ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో వెల్లడైందని నితీష్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు గతవారం టెలివిజన్ చానెల్స్ లో వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంతో మంత్రి ఆలీ ఖాన్ రాజీనామాకు బీజేపీలు అసెంబ్లీలో పట్టుపట్టాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలో 'మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొట్టిన డైలాగ్స్ మరోసారి గుర్తుకు వచ్చాయి.