న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు.
ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్‌లో అన్నదమ్ముల సీసీఫుటేజ్‌ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్‌ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్‌ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు.
ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment