సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది.
- అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు.
- ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు.
- రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు.
- మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది.
- అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు.
- ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్‌డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు.
- కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది.
- దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్‌మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు.
- తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్‌లో వివరించాడు.
- లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
- కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
- అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.
- ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment