మరోసారి విరుచుకుపడ్డ హెజ్‌బొల్లా
పలు సైనిక లక్ష్యాలపై భారీ దాడులు
చిన్నారి సహా ఏడుగురికి గాయాలు
బీరూట్: కొద్దిపాటి విరామం తర్వాత లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై సోమవారం వందలాది రాకెట్లతో దాడికి దిగింది. సెప్టెంబర్‌లో లెబనాన్‌వ్యాప్తంగా వేలాది మంది హెజ్‌బొల్లా సాయుధులను గాయపరచడమే గాక వందల మంది మరణానికి కారణమైన పేజర్ దాడులు తమ పనేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.
తమ దేశ ఉత్తర ప్రాంతంపై నిమిషాల వ్యవధిలోనే 165కు పైగా రాకెట్లు వచ్చిపడ్డట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా పత్రిక పేర్కొంది. వాటిలో 50కి పైగా కార్మియెల్ ప్రాంతం, పరిసర పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించింది. మరోవైపు రేవు పట్టణం హైఫాపైకి రెండు విడతల్లో 90కి పైగా రాకెట్లు దూసుకెళ్లాయి. గలిలీ, కార్మియెల్ ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలపై తాము చేసిన వ్యూహాత్మక దాడులు విజయవంతమైనట్టు హెజ్‌బొల్లా ప్రకటించింది. అనంతరం రాకెట్ దాడుల దృశ్యాలతో కూడిన వీడియోలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ మతిలేని దూకుడు బారినుంచి ఉత్తర ప్రాంతంలోని తమ పౌరులను పూర్తిస్థాయిలో కాపాడుకుంటామని పేర్కొంది. హెజ్‌బొల్లా రాకెట్లను చాలావరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుని సురక్షితంగా కూల్చేసింది. అయినా పలు రాకెట్లు పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్టు సమాచారం. దాడుల్లో బినా పట్టణంలో ఏడాది వయసున్న ఓ చిన్నారితో పాటు ఏడుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 8న కూడా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భారీగా రాకెట్ దాడులకు దిగడం తెలిసిందే. లెబనాన్‌తో కాల్పుల విరమణ దిశగా చర్చల్లో పురోగతి కని్పస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గైడెన్ సార్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment