అమర్‌నాథ్ ఉగ్రదాడి నిందితుడి ఎన్‌కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీః లష్కరే తోయిబాకు చెందిన టాప్ మిలిటెంట్, అమర్‌నాథ్ దాడిలో కీలక పాత్ర పోషించిన అబూ ఇస్మాయిల్ శ్రీనగర్ జిల్లా నౌగం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. లష్కరే టెర్రరిస్టు అబూ ఇస్మాయిల్, అతడి సహచరుడు నౌగం ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో హతులయ్యారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.ఇది పోలీసులు, భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయమని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఇద్దరు హిజ్భుల్ సానుభూతిపరుల అరెస్ట్
జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు హిజ్భుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరులను గురువారం అరెస్ట్ చేశారు. హండ్వారా ప్రాంతంలో వాహీద్ అహ్మద్ భట్, ముహ్మద్ షఫీ మీర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి రెండు గ్రెనేడ్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులను అవసరమైన వస్తువులను అందజేయటం, భద్రతా దళాల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ సమాచారాన్ని చేరవేయడం వీరు చేస్తున్నారని అధికారులు తెలిపారు.