ఎన్‌ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు  | Terrorist Case To National Investigation Agency | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు 

Published Mon, Feb 6 2023 8:10 AM | Last Updated on Mon, Feb 6 2023 8:10 AM

Terrorist Case To National Investigation Agency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్‌ గ్రెనేడ్లతో భారీ విధ్వంసానికి కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్‌ జాహెద్, మహ్మద్‌ సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) బదిలీ అయింది. ఈ కేసుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆధారంగా గత నెల 25న తాజా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఎన్‌ఐఏ హైదరాబాద్‌ యూనిట్‌ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు ఎన్‌ఐఏ డీఎస్పీ రాజీవ్‌ కుమార్‌ సింగ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆదివారం అప్‌లోడ్‌ చేయడంతో విషయం వెలుగులోకి  వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌ 2న అరెస్టు అయిన ఈ ఉగ్ర త్రయంపై తొలుత సీసీఎస్‌ ఆధీనంలోని సిట్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను సిట్‌ అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన బృందాలు వివిధ కోణాల్లో విచారించాయి. ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ కోణాలు అనేకం ఉన్నాయని నగర పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్, అబ్దుల్‌ మాజిద్‌కు సంబంధించిన కీలక వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉంది. వీరి నుంచి ఈ త్రయానికి విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆదేశాలు అందాయి.

చైనాలో తయారైన హ్యాండ్‌ గ్రెనేడ్లు అక్కడ నుంచే లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) మీదుగా కాశ్మీర్‌కు డ్రోన్ల ద్వారా డెడ్‌ డ్రాప్‌ విధానంలో చేరాయి. వాటిని అక్కడ నుంచి మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్‌ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్‌ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చారు. ఈ స్లీపర్‌ సెల్స్‌ ఎవరనే దాంతో పాటు ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని భావించిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్నీ ఆరా తీయాల్సి న అవసరం ఉందని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు.

వీటితో పాటు ఉగ్రవాదుల సంప్రదింపుల మార్గాలు, నగదు లావాదేవీలు గుర్తించడంతో సహా కీలక వివరాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. వీటితో పాటు ఈ కేసులో పోలీసులు అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (యూఏపీఏ) కింద ఆరోపణలు చేర్చా రు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను కస్టడీకి తీసుకోవడానికి ఎన్‌ఐఏ అధికారులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.   

(చదవండి: 300 బస్సులు ఎక్కడ?.. డొక్కు బస్సులే దిక్కా?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement