
సంచలన తీర్పు: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరి
కోల్‌కతా: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పశ్చిమ బెంగాల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శనివారం సంచలన తీర్పు చెప్పింది. శిక్షపడిన ముగ్గురిలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులుకాగా, ఒకరు భారతీయుడు.
2007లో బంగ్లాదేశ్ సరిహద్దుగుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను(మొహమ్మద్ యూనస్, అబ్దుల్లా, ముజఫర్ అహ్మద్ రాథోడ్, షేక్ అబ్దుల్లా నయీం) బీఎస్‌ఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. అనంతరం బెంగాల్ సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. నిందితులపై ఐపీసీ 120బి, 121, 122 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దోషులేనని నిర్ధారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ శనివారం తీర్పు చెప్పిది. నాలుగో దోషి(షేక్ అబ్దుల్లా నయీం) పరారీలో ఉన్నాడు.
ఇదీ నేపథ్యం..
పాకిస్థాన్‌లోని హరీపూర్‌కు చెందిన టీచర్ అబ్దుల్లా, కరాచీకి చెందిన యూనస్, జమ్ముకశ్మీర్(అనంతనాగ్)కు చెందిన ముజఫర్ అహ్మద్, మహారాష్ట్రకు చెందిన షేక్ అబ్దుల్లా నయీమ్‌లు లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరి భీరక ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక జట్టుగా ఏర్పడన ఈ నలుగురూ.. కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై దాడి చేసేందుకు పథకం రచించి 2007లో బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతూ పట్టుపడ్డారు. బీఎస్‌ఎఫ్ అధికారులు.. వీరి నుంచి ఏకే-47 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీఐడీకి అప్పగించారు. విచారణ సందర్భంగా షేక్ అబ్దుల్లా నయీంను మహారాష్ట్రకు తరలించగా అతను పోలీసుల కళ్లుకప్పి తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నిందితులపై కేసు నిరూపణకావడంతో శనివారం తీర్పు వెలువడింది.