ముంబై పేలుళ్లు జరిగిన తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ - దానికి సూత్రధారి హఫిజ్ సయీద్
ముంబై దాడుల(26/11) సూత్రధారి హఫిజ్ సయీద్ పాకిస్థాన్‌లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా హఫిజ్‌ను బంధించగలదా? లేక మునుపటి ప్రభుత్వం మాదిరే కాలానికి వదిలేస్తుందా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ముంబైపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి ఆరేళ్లు పూర్తి అయింది. 2008 నవంబర్ 26న సముద్రమార్గంలో భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ముష్కర మూకలు జరిపిన దాడిలో 166 మంది చనిపోయారు. 358 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడ్డ 10 మందిలో 9 మందిని ఆపరేషన్‌లో భారత కమెండోలు కాల్చి పారేశారు. మరో ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకుని కొన్నేళ్ల విచారణ తర్వాత ఉరి తీశారు. కానీ పాశవికమైన ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా ఉన్న హఫిజ్ సయీద్ మాత్రం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అక్కడి ప్రభుత్వ సత్కారాలు కూడా పొందుతున్నాడు.
పాక్ గూఢచార సంస్ధ ఐఎస్ఐ, పాక్ సైన్యం తోడ్పాటుతో పొరుగుదేశంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోన్న హఫిజ్ సయీద్ జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు. భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషం నూరిపోసే సయీద్ ప్రసంగాలంటే పాకిస్థాన్‌లో క్రేజ్ ఎక్కువ. సేవా కార్యక్రమాలు చేపడ్తోందని పాక్‌లో ప్రచారంలో ఉన్న జమాత్ ఉద్ దవా అక్కడి ఉగ్రవాదులకే కాక భారత్‌కు వ్యతిరేకంగా పోరాడే అన్ని ఉగ్రవాద సంస్థలకు అన్ని అండదండలూ అందిస్తోంది. లష్కర్ ఎ తొయిబా కూడా ఈ తాను ముక్కే. హఫిజ్ సయీద్ పూర్వీకులది హర్యానా. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. సయీద్ అక్కడే పుట్టాడు. విభజన సమయంలో తన పూర్వీకులు హత్యకు గురయ్యారని ప్రసంగాల్లో చెప్పే సయీద్ మాటల్లో నిజం ఎంతనేది ఇప్పటికీ అనుమానమే అని పోలీసు వర్గాలు చెబుతుంటాయి. తొలుత ఆఫ్ఘనిస్థాన్‌లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన తాలిబన్లతో సత్సంబంధాలు నెరపిన సయీద్ ఆ తర్వాత తన లక్ష్యాన్ని భారత్‌పైకి మార్చాడు.
ముంబై దాడుల్లో ఉగ్రవాదులకు సహకరించి అరెస్ట్ అయిన డేవిడ్ హెడ్లీ సిఐఏకు అన్ని విషయాలూ పూసగుచ్చినట్లు చెప్పారు. సయీద్ ఏ రకంగా భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నదీ వివరించాడు. ఒక్క ముంబై దాడే కాదు, భారత్‌లో జరుగుతున్న అనేక ఉగ్రవాద కార్యక్రమాలకు హఫిజ్ సయీద్ కీలకంగా ఉన్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై దాడికి సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడి చంపిన అమెరికా హఫిజ్ సయీద్ భరతం కూడా అలాగే పడుతుందా అనేది అనుమానాస్పదమే. పేరుకు మోస్ట్ వాంటెడ్ అనే ముద్ర వేసి సయీద్ తలపై కోట్ల రూపాయల నజరానా ప్రకటించినా అమెరికా సయీద్‌ను భారత్‌కు పట్టివ్వడంలో సీరియస్‌గా లేదు. అమెరికా సహకరించినా, సహకరించకపోయినా హఫిజ్ సయీద్‌ను భారత సర్కారు కోర్టు ముందు నిలబెట్టగలదా? అనేది అనుమానాస్పదమే. విదేశాంగ విధానంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని అంతర్జాతీయంగా కూడా దేశాలను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోన్న మోదీ సర్కారు హఫిజ్‌ను, భారత్‌పైకి టెర్రరిస్ట్ మూకలను ఉసిగొల్పి పంపుతున్న ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల మద్దతు అత్యంత ఆవశ్యకమనేది ఎవరూ కాదనలేని సత్యం. ప్రపంచ దేశాలు తెచ్చే ఒత్తిడితో పాక్ దారిలోకి రాక తప్పదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
**