పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ ఉగ్రవాది
కరాచీ: బహిరంగంగా సంచరిస్తోన్న ఉగ్రవాది ప్రభుత్వాధినేతపైనే ధ్వజమెత్తాడు. దాయాది దేశ అంతర్గత వ్యవహారంలో తలను పూర్తిగా దూర్చాలని ప్రధానమంత్రిని హెచ్చరించాడు. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని నవాజ్ షరీఫ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శుక్రవారం కరాచీలోని మర్కజ ఇ తఖ్వా మసీదులో నిర్వహించిన శాంతి సభలో హఫీజ్ ఈ మేరకు ఘాటు ప్రసంగం చేశాడు.
'అవతల భారత్ ఆధీనంలోని కశ్మీరీలు కష్టాల్లో ఉన్నారు. అక్కడి సైన్యం చేతిలో చావుదెబ్బలు తింటున్నారు. వారిపట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏవో రెండు మూడు హెచ్చరికలు తప్ప ఈ విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిందేమీలేదు. పాక్ ప్రభుత్వం తక్షణమే కశ్మీరీలకు అవసరమైన 'అన్నిరకాల' సహాయసహకాలు అందించాలి'అని హఫీజ్ సయీద్ అన్నాడు. కశ్మీర్ అంశంలో కలుగజేసుకోకుండా ఉండేలా పాకిస్థాన్ లో రాజకీయ అస్థిరత సృష్టించాలని భారత్ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను ధీటుగా తిప్పికొట్టాలని హఫీజ్ పిలుపునిచ్చాడు. దేశమంతా క్వెట్టా ఉగ్రదాడి విషాదంలో ఉన్న తరుణంలో హఫీజ్ చేసిన వ్యాఖ్యలను పాక్ మీడియా సైతం తప్పుపట్టడం గమనార్హం. గతవారం క్వెట్టాలోని పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడి, 59 మంది ట్రైనీ పోలీసులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.