
నా అరెస్టు ప్రేరణనిస్తుంది
కశ్మీరీ ఉద్యమంపై ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్
లాహోర్: ‘‘వాషింగ్టన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే.. నన్ను గృహనిర్బంధంలోకి తీసుకు న్నారు. నన్ను నిర్బంధించడం ద్వారా కశ్మీర్‌లోని స్వేచ్ఛా ఉద్యమానికి చెక్ పెట్టవచ్చని ఎవరైనా భావిస్తే.. వారు కచ్చితంగా భ్రమల్లో ఉన్నట్లే. భారత్ కు వ్యతిరేకంగా కశ్మీరీలు జరుపుతున్న ఉద్యమానికి నా అరెస్టు ప్రేరణనిస్తుంది’’ అని ముంబై పేలుళ్ల సూత్రధారి, జేయూడీ ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ పేర్కొన్నాడు. తన అరెస్టు ద్వారా కశ్మీర్‌లో ఉపశమనం లభిస్తుందని భారత ప్రధాని మోదీ భావిస్తే.. అది పెద్ద తప్పేనన్నాడు. ‘2017ను కశ్మీరీల సంఘీభావ సంవత్స రంగా నిర్ణయించాం. పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఫిబ్రవరి 5న కార్యక్రమా లు నిర్వహించాలని నిర్ణయించాం’ అని చెప్పాడు.
కాగా, సయీద్‌తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను గృహ నిర్బంధంలోకి తీసుకోవడంపై పాక్ ఆర్మీ స్పందిస్తూ.. ఇది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని ప్రకటించింది. సయీద్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం 90 రోజుల పాటు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పాక్ ప్రభుత్వం రానున్న రోజుల్లో జేయూడీతో పాటు దాని సోదర సంస్థలకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకునే అవకాశముందని చెప్పారు. ‘సయీద్ నిర్బంధంపై సంబంధిత విభాగం ఒకట్రెండు రోజుల్లో మరింత సమాచారం ఇవ్వవచ్చు’ అని మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ లాహోర్, ముల్తాన్ , కరాచీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.