పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు! | Hafiz Saeed is threat to Pakistan, says defence minister | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు!

Published Wed, Feb 22 2017 12:13 PM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు! - Sakshi

పాకిస్తాన్ కు తీవ్ర ముప్పు!

ఇస్లామాబాద్‌: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో తమ దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. పాక్‌ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అతన్ని గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్‌కు ఉన్న ఉగ్రవాద సంబంధాలపై ఒక పాక్‌ నేత బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి.  2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రదాడుల అనంతరం సయీద్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. అయితే 2009లో కోర్టు అతనికి విముక్తి కల్పించింది. వివిధ తీవ్రవాద కార్యకలాపాల్లో సయీద్‌ ప్రమేయాన్ని గుర్తించిన అమెరికా ప్రభుత్వం అతని తలపై రూ. 67 కోట్ల రివార్డు ప్రకటించింది.

సదస్సులో తీవ్రవాదంపై జరిగిన చర్చలో ఆసిఫ్‌ మాట్లాడుతూ ‘తీవ్రవాదానికి ఏ మతంతోనూ  సంబంధాలు లేవు, వారికి ఏ మతాన్నీ ఆపాదించొద్దు, వారు క్రిస్టియన్‌లు కాదు, ముస్లింలూ కాదు, బౌద్ధులు, హిందువులూ కాదు, వారు కేవలం తీవ్రవాదులు, నేరస్తులు’ అని పేర్కొన్నారు. ఈ నెల రోజుల్లో పాక్‌లో 8 తీవ్రవాద దాడులు జరిగాయని, కనీసం వందమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తమ దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు.

సయీద్‌ ఆయుధ లైసెన్స్‌ రద్దు
లాహోర్‌: జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో పాటు అతని అనుచరులకు జారీ చేసిన 44 ఆయుధ లైసెన్స్‌లను భద్రతా కారణాల రీత్యా రద్దు చేస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. ఆయుధ లైసెన్స్‌లు రద్దు చేయడంతో సయీద్, అతని సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభమైనట్లు హోంశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సయాద్‌తో పాటు అతని సంస్థల్లోని మరో 37 మంది దేశం విడిచి వెళ్లకుండా పాక్‌ ప్రభుత్వం వారి పేర్లను ఎగ్జిట్‌ కంట్రోల్‌ జాబితాలో చేర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement