సయీద్‌పై అమెరికా సూచన.. పాక్ వినేనా!
వాషింగ్టన్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో యథేచ్ఛగా తిరుగుతూ.. ఉపన్యాసాలు దంచడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ పాక్‌లో అతడు యథేచ్ఛగా తిరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ఉగ్రవాద గ్రూపులు, మిలిటెంట్, తాలిబన్ గ్రూపులన్నింటినీ టార్గెట్ గా చేసుకొని వాటిని సమూలంగా నిర్మూలించాలని తాము పాకిస్థాన్‌కు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నామని అమెరికా తెలిపింది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రెస్ కార్యాలయం డైరెక్టర్ ఎలిజబెత్ ట్రడూ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో హింసను ఖండించకపోవడం ద్వారా అమెరికా భారత్‌కు మరింత స్వేచ్ఛను ఇస్తున్నదని సయీద్ మీడియాతో పేర్కొన్న వ్యాఖ్యల నేపథ్యంలో పాక్‌లో అతడి స్వేచ్ఛాయుత కదలికలపై ట్రడూ ఆందోళన వ్యక్తం చేశారు. అతని కదలికలపై తాము చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసినా పాక్ పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిష్కారం కోసం అన్నివర్గాల వారు కృషి చేసేందుకు తాము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.