లష్కర్ ఈ తైబా నాయకుడు హఫీజ్ సయీద్ (పాత ఫొటో)
వాషింగ్టన్ : సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పాకిస్తాన్‌కు చెందిన మిల్లి ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీకి షాక్ తగిలింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్‌దవా(జేయూడీ) స్థాపించిన ఈ పార్టీని ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించింది. దీంతో పాటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఏడుగురు నాయకులను ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు చెప్పింది.
లష్కర్-ఈ-తైబా(ఎల్‌ఈటీ) కశ్మీర్‌లో నడుపుతున్న తెహ్రిక్-ఈఆజాదీ-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను సైతం ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు హోం శాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలని ఎంఎంఎల్‌ను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్(పీఈసీ) కోరిన తరుణంలో అమెరికా నిర్ణయం సయీద్‌కు చావుదెబ్బే.
రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం గతంలో ఎంఎంఎల్ చేసిన దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారనే అభియోగంపై పాకిస్తాన్ హోం శాఖ ఎంఎంఎల్‌కు రాజకీయ పార్టీ హోదా ఇవ్వొద్దని ఈసీని కోరింది. అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ముద్ర పడుతుందనే భయంతో ఎల్‌ఈటీ తరచూ పేర్లు మార్చుకుంటూ వస్తుంది.
టీఏజేకే, ఎంఎంఎల్‌లు ఎల్‌ఈటీకు మారు పేర్లే. అంతర్జాతీయ సమాజానికి ఈ విషయం తెలియజేసేందుకే టీఏజేకే, ఎంఎంఎల్‌లను ఉగ్రసంస్థలుగా గుర్తిస్తున్నామని అమెరికా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment