వాళ్లను విచారించి తీరాల్సిందే: అమెరికా | USA Says Pak Must Prosecute Arrested LeT Terrorists | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రవాదులను విచారించి తీరాల్సిందే: అమెరికా

Published Mon, Oct 14 2019 12:00 PM | Last Updated on Mon, Oct 14 2019 12:04 PM

USA Says Pak Must Prosecute Arrested LeT Terrorists - Sakshi

వాషింగ్టన్‌ : తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. లష్కర్‌-ఎ-తొయిబా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ సహా ఇతర ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని పేర్కొంది. తమ దేశ భవిష్యత్తు కోసం ఉగ్రవాదలును ఏరివేస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ ట్వీట్‌ చేశారు. కాగా ఫినాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ) బ్లాక్‌లిస్టులో ఉన్న దేశాల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

ఇక భారత్‌లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్‌, లష్కర్‌-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన పాకిస్తాన్‌... తాము విడుదల చేసి నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తమ జాబితాలో గ్రేలిస్టులో ఉన్న పాకిస్తాన్‌ ఉగ్రవాదుల పట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఇరాన్‌, ఉత్తర కొరియాలతో పాటు బ్లాక్‌లిస్టులో చేరుస్తామని ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరించింది. అక్టోబరు 2019 నాటికి తమ విధానమేమిటో స్పష్టం చేయాలని పాక్‌ను కోరింది. ఈ నేపథ్యంలో గురువారం ఎల్టీఈ చీఫ్‌ సయీద్‌ సహా ఉగ్ర సంస్థలకు సహాయం చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్‌ మీడియా పేర్కొంది. ఇక 2008లో ముంబై పేలుళ్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్‌ సయీద్‌పై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాల్లో అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాక్‌ ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement