milli muslim league
-
జైల్లో మాజీ ప్రధాని.. ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాది
లాహోర్ : ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ధోరణి మరోసారి బట్టబయలయింది. అవినీతి కేసుల్లో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేశామంటూ గొప్పలు చెప్పుకున్న పాక్, ఉగ్రవాదుల విషయంలో మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను స్వదేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ముంబై దాడుల ప్రధాన సూత్రధారుడు, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో మాత్రం పాక్ ఇందుకు భిన్న వైఖరి కనబరుస్తోంది. ఇప్పటికే అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డుతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రసుత్తం జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఉగ్ర సంస్థకు హఫీజ్ అధినేతగా ఉన్నాడు. మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ జూలై 25న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో హఫీజ్ కొడుకు, అల్లుడు, 13 మంది మహిళలతో పాటు జేయూడీ ఉగ్ర సంస్థకు చెందిన 265 మంది సభ్యులు ఎంఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాల్లీలో హఫీజ్ పాల్గొంటున్నాడు. ఎంఎంఎల్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో జేయూడీ ఉగ్ర సంస్థ సీనియర్ యాకుబ్ షేక్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, ధర్మం ప్రతిపాదికన ఎంఎంఎల్ అభ్యర్థులను గెలిపించాలని పాక్ ప్రజలను కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాక్‌లోని పరిస్థితులను మార్చివేస్తామని అన్నారు. మానవత్వంతో సేవలందిస్తామని, కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తామని తెలిపారు. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా భారత్, యూఎస్‌లపై విరుచుకుపడుతున్నారు. అవినీతికి పాల్పడ్డ ఆ దేశ మాజీ ప్రధానిని జైల్లో ఉంచిన పాక్, ఉగ్ర సంస్థలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పొలిటికల్ పార్టీకి షాక్
వాషింగ్టన్ : సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పాకిస్తాన్‌కు చెందిన మిల్లి ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీకి షాక్ తగిలింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్దవా(జేయూడీ) స్థాపించిన ఈ పార్టీని ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించింది. దీంతో పాటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఏడుగురు నాయకులను ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు చెప్పింది. లష్కర్-ఈ-తైబా(ఎల్ఈటీ) కశ్మీర్లో నడుపుతున్న తెహ్రిక్-ఈఆజాదీ-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను సైతం ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు హోం శాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలని ఎంఎంఎల్‌ను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్(పీఈసీ) కోరిన తరుణంలో అమెరికా నిర్ణయం సయీద్‌కు చావుదెబ్బే. రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం గతంలో ఎంఎంఎల్ చేసిన దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారనే అభియోగంపై పాకిస్తాన్ హోం శాఖ ఎంఎంఎల్‌కు రాజకీయ పార్టీ హోదా ఇవ్వొద్దని ఈసీని కోరింది. అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ముద్ర పడుతుందనే భయంతో ఎల్ఈటీ తరచూ పేర్లు మార్చుకుంటూ వస్తుంది. టీఏజేకే, ఎంఎంఎల్‌లు ఎల్‌ఈటీకు మారు పేర్లే. అంతర్జాతీయ సమాజానికి ఈ విషయం తెలియజేసేందుకే టీఏజేకే, ఎంఎంఎల్‌లను ఉగ్రసంస్థలుగా గుర్తిస్తున్నామని అమెరికా వివరించింది. -
హఫీజ్‌కు చుక్కెదురు!
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి చెక్ పెట్టింది. వచ్చ ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ఇప్పటికే సయీద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు గతంలోనే పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిరాకరించింది. మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీ నిషేధిత జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు జేబు సంస్థఅని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంఎంఎల్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఇటువంటి పార్టీలకు అనుమతివ్వండం దేశానికి మంచిది కాదని పేర్కొంది. రాజకీయాల్లో హింస, వేర్పాటు, ఉగ్రవాదా భావజాలం వేగంగా వ్యాప్తి చెందేందుకు ఇటువంటి పార్టీలు దోహదం చేస్తాయని అంతర్గ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు కూడా.. ఎంఎంఎల్ పిటీషన్‌ను స్వీకరించేది పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపింది. -
పాక్ పాలిటిక్స్‌లో సంచలనం: హఫీజ్ కొత్త పార్టీ
ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ మరో సంచలనానికి తెరలేపాడు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న ఆయన.. తను నెలకొల్పిన మత సంస్థ ‘జమాత్ ఉల్ దవా’కు కొనసాగింపుగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. సయీద్ ప్రధాన అనుచరుడు సైఫుల్లా ఖలీద్ సోమవారం ఇస్లామాబాద్‌లో కొత్త పార్టీని ప్రకటించాడు. పార్టీ పేరు ‘మిల్లి ముస్లిం లీగ్’(ఎంఎంఎల్) అని, పాకిస్తాన్‌ను నిజమైన ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ ధ్యేయమని సైఫుల్లా చెప్పుకొచ్చాడు. గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్ విడుదలయ్యే వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తానే నిర్వహిస్తానని తెలిపాడు. 2018లో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఎజెండా కలిగిన పార్టీలతో కలిసి భారీ కూటమిని ఏర్పాటుచేయాలని హఫీజ్ భావిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్‌కు చెందిన హఫీజ్ సయీద్‌కు.. స్వరాష్ట్రం సింధ్‌లో భారీ మద్దతు ఉన్నది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేలా స్థానిక పార్టీలతో కలిసి పనిచేయబోతున్నట్లు సైఫుల్లా ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఎన్నికల్లో ప్రభావం చూపుతారా? కాగా, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతఛాందసుల సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేవలం మత రాజ్యం ఎజెండాతో హఫీజ్ స్థాపించిన ఎంఎంఎల్ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. ఎంఎంఎల్ తరహాలోనే.. మొదట మత సంస్థలుగా ప్రారంభమై, రాజకీయ పార్టీలుగా మారిన జమైత్ ఉలేమా ఎ ఇస్లామిక్ ఫజల్(వ్యవస్థాపకుడు ఫజ్లూర్ రెహమాన్) నుంచి ప్రస్తుత జాతీయ అసెంబ్లీకి డజను మంది సభ్యులు ఎన్నికయ్యారు. జమాత్ ఏ ఇస్లామి అనే మరో పార్టీ నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా కలిసి పోటీచేసినా, ప్రగతిశీల పార్టీలుగా పేరు పొందిన పీఎల్‌ఎం-ఎన్(నవాజ్), పీపీపీ(భుట్టో కుటుంబం), పీటీఐ(ఇమ్రాన్ ఖాన్), ఏఎన్పీ(అబ్దుల్ వలీ)లను ఎలా నెగ్గుకొస్తారు వేచిచూడాల్సిందే. గృహనిర్బంధంలోనే హఫీజ్.. పలు ఉగ్రకుట్రలకు కేంద్రబిందువైన హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడంతో అక్కడి ప్రభుత్వం అతన్ని ఎట్టకేలకు జనవరి 31న నిర్బంధించింది. గడిచిన ఆరు నెలలుగా హఫీజ్ గృహనిర్బంధంలోనే ఉన్నాడు. తాజాగా(జులై 27న) అతని హౌస్ అరెస్ట్‌ను మరో రెండు నెలలు పొగించారు. దీంతో జమాతుల్ దవా కార్యకలాపాలన్నీ హఫీజ్ నమ్మిన బంటు సైఫుల్లానే పర్యవేక్షిస్తున్నారు. హఫీజ్ ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో సైఫుల్లా చేత పార్టీ ప్రకటన చేయించాడు.