పాక్ పాలిటిక్స్‌లో సంచలనం: హఫీజ్ కొత్త పార్టీ
ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ మరో సంచలనానికి తెరలేపాడు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న ఆయన.. తను నెలకొల్పిన మత సంస్థ ‘జమాత్ ఉల్ దవా’కు కొనసాగింపుగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు.
సయీద్ ప్రధాన అనుచరుడు సైఫుల్లా ఖలీద్ సోమవారం ఇస్లామాబాద్‌లో కొత్త పార్టీని ప్రకటించాడు. పార్టీ పేరు ‘మిల్లి ముస్లిం లీగ్’(ఎంఎంఎల్) అని, పాకిస్తాన్‌ను నిజమైన ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ ధ్యేయమని సైఫుల్లా చెప్పుకొచ్చాడు. గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్ విడుదలయ్యే వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తానే నిర్వహిస్తానని తెలిపాడు.
2018లో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఎజెండా కలిగిన పార్టీలతో కలిసి భారీ కూటమిని ఏర్పాటుచేయాలని హఫీజ్ భావిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్‌కు చెందిన హఫీజ్ సయీద్‌కు.. స్వరాష్ట్రం సింధ్‌లో భారీ మద్దతు ఉన్నది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేలా స్థానిక పార్టీలతో కలిసి పనిచేయబోతున్నట్లు సైఫుల్లా ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
ఎన్నికల్లో ప్రభావం చూపుతారా?
కాగా, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతఛాందసుల సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేవలం మత రాజ్యం ఎజెండాతో హఫీజ్ స్థాపించిన ఎంఎంఎల్ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంది. ఎంఎంఎల్ తరహాలోనే.. మొదట మత సంస్థలుగా ప్రారంభమై, రాజకీయ పార్టీలుగా మారిన జమైత్ ఉలేమా ఎ ఇస్లామిక్ ఫజల్(వ్యవస్థాపకుడు ఫజ్లూర్ రెహమాన్) నుంచి ప్రస్తుత జాతీయ అసెంబ్లీకి డజను మంది సభ్యులు ఎన్నికయ్యారు. జమాత్ ఏ ఇస్లామి అనే మరో పార్టీ నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా కలిసి పోటీచేసినా, ప్రగతిశీల పార్టీలుగా పేరు పొందిన పీఎల్‌ఎం-ఎన్(నవాజ్), పీపీపీ(భుట్టో కుటుంబం), పీటీఐ(ఇమ్రాన్ ఖాన్), ఏఎన్‌పీ(అబ్దుల్ వలీ)లను ఎలా నెగ్గుకొస్తారు వేచిచూడాల్సిందే.
గృహనిర్బంధంలోనే హఫీజ్..
పలు ఉగ్రకుట్రలకు కేంద్రబిందువైన హఫీజ్‌ను అరెస్ట్ చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడంతో అక్కడి ప్రభుత్వం అతన్ని ఎట్టకేలకు జనవరి 31న నిర్బంధించింది. గడిచిన ఆరు నెలలుగా హఫీజ్ గృహనిర్బంధంలోనే ఉన్నాడు. తాజాగా(జులై 27న) అతని హౌస్ అరెస్ట్‌ను మరో రెండు నెలలు పొగించారు. దీంతో జమాతుల్ దవా కార్యకలాపాలన్నీ హఫీజ్ నమ్మిన బంటు సైఫుల్లానే పర్యవేక్షిస్తున్నారు. హఫీజ్ ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో సైఫుల్లా చేత పార్టీ ప్రకటన చేయించాడు.