లాహోర్ టు ఇస్లామాబాద్: హఫీజ్ భారీ ర్యాలీ
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ మంగళవారం కశ్మీర్ కు స్వాతంత్ర్యం(కశ్మీర్ కారవాన్) పేరుతో భారీ ర్యాలీ చేపట్టాడు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు (264 కిలోమీటర్లు) సాగనున్న ఈ ర్యాలీలో వేల మంది జమాత్ ఉల్ దవా కార్యకర్తలు, వందలాది వాహనాల్లో దేశ రాజధాని వైపు కదిలారు. బుధవారానికి ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోనుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి కశ్మీర్ విషయంలో పాక్ సెనెటర్లు, ఇతర నేతలపై ఒత్తిడి ఒత్తిడి పెంచుతామని హఫీజ్ మీడియాకు చెప్పాడు.
కశ్మీర్ లోయలో హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు 11 రోజులు గడిచినా చల్లారడంలేదు. ఇప్పటికే ఒక జవాన్ సహా 43 మంది పౌరులు చనిపోయారక్కడ. కశ్మీర్ లో ఉద్రిక్తతలు పార్లమెంట్ ను సైతం కుదిపేశాయి. సోమవారం రాజ్యసభలో కశ్మీర్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. 'లోయలో ఆందోళనలన్నీ పాకిస్థాన్ ప్రోద్బలంతో జరుగుతున్నవే'అని అన్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే ర్యాలీ ద్వారా కశ్మీర్ అంశాన్ని తిరిగికి ప్రాముఖ్యత తీసుకురావాలన్నది హఫీజ్ వ్యూహంగా కనిపిస్తోంది.