
శనివారం రాత్రి అంధకారంలో కరాచీ నగరం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు.
సింధ్ ప్రావిన్స్‌లోని గుడ్డు పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్‌ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు.