
హఫీజ్ సయీద్, లాడెన్
జెనీవా : తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్న దాయాది పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూనే.. మరోవైపు పాక్ బాధితురాలంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డింది. విఫలరాజ్యంగా పేరొందిన పాక్ నుంచి మానవ హక్కులపై లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదని ఘాటుగా బదులిచ్చింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 37వ సదస్సులో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ పాక్ చేసిన ఆరోపణలను మన దేశ ప్రతినిధి (ఇండియా సెంకండ్ సెక్రటరీ) మినిదేవీ కుమామ్ తిప్పికొట్టారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను రక్షించి.. ముల్లా ఒమర్‌కు ఆశ్రయమిచ్చిన దేశం తనను తాను బాధితగా చెప్పుకోవడం అసాధారణం’ అని ఆమె అన్నారు. ‘ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267ను ఉల్లంఘిస్తూ.. ఐరాస నిషేధిత ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్ లాంటివారు పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఐరాస నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో రాజకీయ ప్రధాన స్రవంతిలో కొనసాగుతున్నాయి’ అని ఆమె మండిపడ్డారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తోందని ఆమె అన్నారు. ఎలాంటి భయంలేకుండా ఉగ్రవాదులు పాక్ నడివీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నారని, ఒక విఫలరాజ్యంగా మారిన దేశం నుంచి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం వినాల్సిన అగత్యం ప్రపంచానికి లేదని ఘాటుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment