'ఒక్క బుర్హాన్ను కాల్చిచంపితే...'
ఇస్లామాబాద్: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ 300 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా కనీసం పైకి ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయ బుర్హాన్ ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా వేడెక్కడం, బుర్హాన్ సొంత ఊరు త్రాల్ పట్టణంలో జరిగిన అంత్యక్రియలకు జనం లక్షల్లో హాజరుకావడం, ఘటన జరిగి నాలుగు రోజులైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడాన్ని దాయాది పాకిస్థాన్ ఎప్పటిలాగే అవకాశంగా తీసుకుంది. భారత్ ను రెచ్చగొట్టేలా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఉగ్రవాది బుర్హాన్ ను పొగిడారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్, పాకిస్థాన్ లోని ఇతర పార్టీల నోటా ఇప్పుడు బుర్హాన్ మాటే.
'కశ్మీరీ యువ నాయకుడు బుర్హాన్ వని మరణ వార్త ప్రధాని నవాజ్ షరీఫ్ ను తీవ్రంగా కలిచివేసంది. వనీతోపాటు భారత సైన్యం, అర్ధసైన్యం జరిపిన చట్ట వ్యతిరేక కాల్పుల్లో చనిపోయిన ఇతరులకూ ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. స్వయం పాలన కోరుకుంటోన్న కశ్మీరీల హక్కులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేయాలి' అని పాక్ ప్రధాని కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ సైతం బుర్హాన్ మరణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్ సమీపంలో జరిగిన సంస్మరణ సభలో హపీజ్ మాట్లాడుతూ.. 'ఆజాద్ కశ్మీర్ కోసం ఒక్క బుర్హాన్ చనిపోతే.. వేల మంది పుట్టుకొస్తారు'అని అన్నారు.
నివని ఎన్ కౌంటర్, అనంత పరిణామాలపై నవాజ్ షరీఫ్ మౌనంగా ఉడటాన్ని పాకిస్థాన్ లోని ప్రతిపక్ష పార్టీలు తప్పు పట్టిన నేపథ్యంలోనే ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. 'నరేంద్ర మోదీ- నవాజ్ షరీఫ్ ల స్నేహం కశ్మీర్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని పాకిస్థాన్ పీపుల్స్ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారి విమర్శించారు. ప్రపంచంలోని ఇతర ముస్లింలు రంజాన్ ను ఆనందోత్సాహల మధ్య జరుపుకోగా, సహోదర కశ్మీరీలు మాత్రం హింసను ఎదుర్కొన్నారని బిలావర్ అన్నారు.