
షారూక్ ఖాన్‌ది ‘ఉగ్ర’భాష!
భారత్‌లో అసహనం తీవ్ర స్థాయిలో ఉందన్న బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి దాడి తీవ్రమైంది.
బాలీవుడ్ నటుణ్ని ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్
♦ ఇష్టమైతే పాక్‌కు వెళ్లిపోవచ్చని సలహా
♦ అలాంటి చెత్త మాటలు వద్దన్న వెంకయ్యనాయుడు
♦ ఆలోచనల సంఘర్షణ సాగాలన్న ఆర్బీఐ గవర్నర్
న్యూఢిల్లీ/జమ్మూ: భారత్‌లో అసహనం తీవ్ర స్థాయిలో ఉందన్న బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి దాడి తీవ్రమైంది. తాజాగా ఓ బీజేపీ ఎంపీ షారూక్‌ను పాక్ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో పోల్చారు. ‘హఫీజ్ సయీద్, షారూక్‌ల మాటల్లో నాకెలాంటి తేడా కనిపించడం లేదు. ఇద్దరూ ఒకే విధమైన ఉగ్రవాద బాష ఉపయోగిస్తున్నారు’ అని బుధవారం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశంలోని మెజారిటీ వర్గీయులు నీ సినిమాలను బహిష్కరిస్తే.. సాధారణ ముస్లింలా నువ్వు కూడా ముంబై వీధుల్లో తిరగాల్సిందేనని గుర్తుం చుకో’ అని హెచ్చరించారు. ముస్లిం అయిన కారణంగా భారత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న షారూక్ తదితరులను సయీద్ పాక్‌కు ఆహ్వానించడంపై స్పందిస్తూ.. కావాలనుకుంటే షారూక్ పాక్ వెళ్లిపోవచ్చన్నారు. ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్వయంగా షారూక్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. భారత్‌లో ఉంటున్నప్పటికీ.. షారూక్ ఖాన్ ఆత్మ పాక్‌లోనే ఉందంటూ మంగళవారం తాను చేసిన ట్వీట్‌ను బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గియా వెనక్కి తీసుకున్నారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న కైలాస్.. ‘భారత్‌లో అసహనమే ఉంటే.. అమితాబ్ తరువాత అంతటి పాపులర్ హీరోగా షారూక్ ఖాన్ అయ్యుండేవాడు కాదు’ అంటూ మరో ట్వీట్ వదిలారు. ముస్లిం అయినంతమాత్రాన షారూక్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం సరికాదని శివసేన అభిప్రాయపడింది. భారత్ సహన దేశమని, ఇక్కడి మైనారిటీలు సహనపరులని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. భారత్ సహనభరిత దేశం కావడం వల్లనే షారూక్ సూపర్ స్టార్ కాగలిగారన్నారు.
అసహనంపై చర్చకు సిద్ధం: వెంకయ్య
పార్లమెంటు సజావుగా సాగేలా కాంగ్రెస్ సహనం చూపితే.. అసహనంపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎమర్జెన్సీ, మీడియాపై ఆంక్షలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్ల కష్టాలు.. వీటన్నింటిపైనా చర్చిద్దామన్నారు. షారూక్ ఖాన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్యలపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరూ అలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దన్నారు. అసహనంపై రచయితలు వ్యక్తం చేస్తున్న నిరసన ప్రజా తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల తరువాత పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేస్తామన్నారు.
ప్రజాస్వామ్యమే భారత్ బలం: రాజన్
భారత్‌లో నెలకొన్న అసహన వాతావరణంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్ధించుకున్నారు. దేశాభివృద్ధికి సహనం, పరస్పర గౌరవం అవసరమన్న తన వ్యాఖ్యలు లోతుగా ఆలోచించి చేసినవన్నారు. ప్రజాస్వామ్యమే భారత్ అతిపెద్ద బలమన్న రాజన్.. స్వేచ్ఛాసమాజ వాతావరణాన్ని కొనసాగించుకోవాలని, దాన్ని మూసేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ఆలోచనల సంఘర్షణ సాగాలన్నారు. ఆరోగ్యకర చర్చ అవసరమని, అది వాదులాటకు, భావ ప్రకటనను హరించడానికి దారితీయకూడదని పేర్కొన్నారు. ‘బ్లూమ్‌బర్గ్ న్యూస్’కిచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కశ్మీరీ పండిట్ల మూకుమ్మడి వలసలు, సిక్కుల ఊచకోత సమయంలో ఇలాంటి నిరసనలు ఎందుకు తెలపలేదని కశ్మీరీ రచయితలు అగ్నిశేఖర్, ఖేమా కౌల్, తదితరులు ప్రశ్నించారు.
ఈ పరిస్థితుల్లో భారత్ రాలేను: గులాం అలీ
న్యూఢిల్లీ: ప్రముఖ పాక్ గజల్ గాయకుడు గులాం అలీ భారత్‌లో త్వరలో జరగనున్న తన సంగీత ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. సంగీత కచేరీలకు ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవన్న కారణంతో ఆయన తన కార్యక్రమాలపై వెనక్కుతగ్గారు. ఎలాంటి రాజకీయాల్లోనూ తాను భాగం కాదల్చుకోలేదని స్పష్టం చేశారు. శివసేన హెచ్చరికలతో గతనెలలో ముంబైలో ఏర్పాటు చేసిన తన సంగీత కచేరీ రద్దు కావడంతో తన తండ్రి ఆ నిర్ణయం తీసుకున్నారని బుధవారం గులాం అలీ కుమారుడు ఆమిర్ తెలిపారు. నవంబర్ 8న ఢిల్లీలో తన తండ్రి గజల్ కచేరీ ఉండబోదని, ముంబైలో జరిగింది చూశాక, తాము రిస్క్ తీసుకోదల్చుకోలేదని అన్నారు. పరిస్థితులు చక్కబడ్డ తరువాత భారత్‌లో గులాం కచేరీ ఉంటుందన్నారు. ముంబై కార్యక్రమం రద్దైన తరువాత నవంబర్ 8న ఢిల్లీలో కచేరీ నిర్వహించాల్సిందిగా ఆప్ ప్రభుత్వం గులాం అలీని ఆహ్వానించింది. కాగా, కవులు, కళాకారుల ‘అవార్డ్ వాపసీ’కి నిరసనగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ శనివారం ఒక ర్యాలీ నిర్వహించనున్నారు.