ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నది. జమాతే ఉద్ దవా (జేయూడీ) వంటి ఉగ్రవాద గ్రుపులకు మీడియా కవరేజ్ ఇవ్వకుండా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని తొలిసారి పాక్ ధ్రువీకరించింది. లష్కరే తోయిబా, జమాతే ఉద్ దావా, ఫల్హా ఏ ఇన్సానియత్ ఫౌండేషన్ గ్రూపులకు మీడియా కవరేజ్ నిషేధించాలంటూ అన్ని శాటిలైట్ టీవీ చానెళ్లు, రేడియో స్టేషన్లకు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది.
జమాతే ఉద్ దావా, ఫల్మా ఏ ఇన్సానియత్ ఫౌండేషన్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థలని ఈ నోటిఫికేషన్ లో స్పష్టంచేసింది. అదేవిధంగా మరో 60 సంస్థలు, 12 ఇతర గ్రూపులపైనా నిఘా ఉంచాలని ఈ నోటిఫికేషన్ పేర్కొంది. జాతీయ కార్యాచరణలో భాగంగానే ఈ సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ స్పష్టంచేసింది. ఈ ఉగ్రవాద గ్రూపులకు సంబంధించి సామాజిక సేవ పేరిట నిధుల సేకరణకు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను కూడా ప్రచురించకూడదని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే టీవీ చానెళ్లు, రేడియో స్టేషన్లపై భారీ జరిమానా విధంచడమే కాకుండా, లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముంటుందని నోటిఫికేషన్ హెచ్చరించింది.
ఇటీవల అమెరికా పర్యటనలో ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అగ్రరాజ్యానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటిఫికేషన్ జారీచేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక 2008లో ముంబైలో 166మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల మారణహోమానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. అతను పాక్ లో యథేచ్ఛగా తిరుగుతూ.. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటాడు.
అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థే
Published Tue, Nov 3 2015 10:09 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement