కాంగ్రెస్‌ నిర్వాకాలతో భారీ మూల్యం  | PM Narendra Modi slams Congress over mumbai attack response | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిర్వాకాలతో భారీ మూల్యం 

Oct 9 2025 5:42 AM | Updated on Oct 9 2025 9:30 AM

PM Narendra Modi slams Congress over mumbai attack response

ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చింది   

ఉగ్రవాదులను బలోపేతం చేసింది  

ముష్కరులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరు?  

దేశ ప్రజలకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి 

ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్‌  

నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం  

నవీ ముంబై: విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చిందని మండిపడ్డారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. ఈ పార్టీ నిర్వాకాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

2008 నవంబర్‌ 26న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైలు నెట్‌వర్క్‌లో ఆక్వా లైన్‌తోపాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా, గొప్ప మెట్రోనగరంగా ప్రఖ్యాతి గాంచిన ముంబైని ఉగ్రవాదులు ఎప్పటినుంచో టార్గెట్‌ చేశారని చెప్పారు. 2008లో భీకర దాడులు జరిగాయని అన్నారు. అప్పట్లో పాక్‌ ఉగ్రవాదుల భరతంపట్టాలని ప్రజలంతా కోరుకున్నారని, మన సైనిక దళాలు సైతం అందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. కానీ, మరో దేశం అడ్డుకోవడంతో సైనిక చర్య ఆగినట్లు కేంద్ర హోంమంత్రే చెప్పారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం చేయొద్దంటూ అప్పట్లో అమెరికా కోరుకుందని చిదంబరం పేర్కొన్నారు.  

పౌరుల భద్రతే ముఖ్యం  
ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదులను బలోపేతం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భద్రతపై రాజీపడిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో బదులిస్తున్నామని, ముష్కరుల భూభాగంలోకి చొరబడి మరీ బుద్ధి చెప్తున్నామని వివరించారు. దేశంతోపాటు పౌరుల భద్రత కంటే తమకు ఇంకేదీ ముఖ్యం కాదన్నారు. 

వికసిత్‌ భారత్‌కు ప్రతీక 
పద్మం ఆకారంలో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వికసిత్‌ భారత్‌కు ఒక ప్రతీక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రూ.19,650 కోట్లతో 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్‌పోర్ట్‌ మొదటి దశను నిర్మించారు. దేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా ఇది రికార్డుకెక్కింది. డిసెంబర్‌లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయ ప్రారం¿ోత్సవంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అదానీ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ గౌతమ్‌ అదానీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబై మెట్రో లైన్‌–3 తుది దశను ప్రధానమంత్రి ప్రారంభించారు.    

దేశమంతటా అభివృద్ధి జాడలు 
వికసిత్‌ భారత్‌కు గతి(వేగం), ప్రగతి(అభివృద్ధి) అత్యంత కీలకమని ప్రధాఉద్ఘాటించారు. గత 11 ఏళ్లుగా మన దేశం వికసిత్‌ని భారత్‌ దిశగా ప్రయాణం సాగిస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. వందేభారత్‌ రైళ్లు ప్రవేశపెట్టామని, బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. జాతీయ రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించామని, నగరాలను అనుసంధానించామని వివరించారు. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

 దేశంలో 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ‘ఉడాన్‌’ పథకంతో గత పదేళ్లలో లక్షలాది మంది తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని, కలలు నెరవేర్చుకున్నారని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ మనదేనని స్పష్టం చేశారు. మరికొన్నేళ్లలో మనదేశం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌(ఎంఆర్‌ఓ) హబ్‌గా మారబోతోందని తేల్చిచెప్పారు. ముంబైలో చారిత్రక భవనాలు దెబ్బతినకుండా 33.5 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ మెట్రో మార్గం నిర్మించిన ఇంజనీర్లు, కార్మికులను ప్రధాని అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement