
‘భారత్‌కు పాక్ మోకరిల్లుతుందనుకోలేదు’
న్యూఢిల్లీ: భారత్ ఒత్తిడికి తలొగ్గి తన సోదరుడు లష్కరే తోయిబా చీఫ్, జమాతే ఉద్ దవా స్థాపకుడు ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ గృహ నిర్బంధం చేసిందని సయీద్ సోదరుడు హఫీజ్ మసూద్ ఆరోపించాడు. అతడిని కలవడం తమకు చాలా కష్టమైపోతోందని, ఇంకా ఆయనను చాలా రోజులు బంధించే అవకాశం ఉందని చెప్పారు.
ప్రస్తుతానికి మసూద్ చర్యలను పాక్ తీక్షణంగా గమనిస్తోందని, కఠిన నిబంధనలు పెట్టిందని, ఆయన మాములుగా కలిసేందుకు పెద్ద విధివిధానాలు పెట్టిందని అన్నారు. జమాత్ ఉద్ దవా కార్యకర్తలు ఎలాంటి ఉగ్రవాద చర్యలకు దిగకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపాడు. లష్కర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అని, ఎన్నో స్కూళ్లను, ఆస్పత్రులు నిర్వహిస్తోందని చెప్పాడు. కశ్మీర్ లష్కర్ యూనిట్‌తో తాము ఎలాంటి చర్యలకు దిగడం లేదని, అది అక్కడ ఏర్పడిన సంస్థే అని వివరించాడు.
‘భారత్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే నా సోదరుడిని గృహనిర్బంధం చేశారని అనుకుంటున్నాం. కశ్మీర్‌లో ఉన్న సమస్యలపై నుంచి ప్రపంచ దృష్టి తప్పించి హఫీజ్ సయీద్, పాకిస్థాన్‌పై మరల్చాలని ఇండియా భావిస్తోంది. భారత్ తాను చేసిన తప్పులు దాయాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇలా చేస్తోంది. భారత్ ఒత్తిడికి పాకిస్థాన్ మోకరిల్లడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా షరీఫ్ భారత్‌కు మద్దతివ్వడం, ఆ దేశంతో స్నేహానికి ప్రయత్నించడం మానుకోవాలి’ అని మసూద్ చెప్పాడు.